ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఈసీ మరో అవకాశం.. మొబైల్ ఫోన్ల ద్వారా ఈ-ఓటరు కార్డుల జారీ

శాసన మండలి ఎన్నికలకూ ఓటరుగా నమోదుకు అవకాశం ఇవ్వాలని ఈసీ నిర్ణయించింది.

ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఈసీ మరో అవకాశం.. మొబైల్ ఫోన్ల ద్వారా ఈ-ఓటరు కార్డుల జారీ
Follow us

|

Updated on: Jan 21, 2021 | 5:03 PM

కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే శాసన మండలి ఎన్నికలకూ నామినేషన్ల దాఖలు చివరి తేదీకి 10 రోజుల ముందు వరకు ఓటరుగా నమోదుకు అవకాశం ఇవ్వాలని ఈసీ నిర్ణయించింది. గతంలో ఈ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తర్వాత కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉండేది కాదు. తాజాగా ఆ పద్ధతిలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు మరో అవకాశం లభించినట్లైంది.

కాగా, రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు సభ్యుల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. వాటికి ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో ఓటర్ల తుది జాబితాను ఇటీవల ప్రకటించగా మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ నియోజకవర్గం జాబితా శుక్రవారం వెలువడనుంది. జాబితా వెలువడిన రోజు నుంచి ఓటు హక్కు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోడానికి వెబ్‌సైట్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో నామినేషన్ల దాఖలు చివరి తేదీకి 10 రోజుల ముందు వరకు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వీలుంటుంది. దీంతో ఈదఫా 9 నుంచి 10 లక్షలమంది కొత్తగా ఓటర్లు నమోదయ్యే అవకాశం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

అలాగే, రాష్ట్రంలోని ఓటర్లందరి మొబైల్‌ ఫోన్‌ నంబర్లు సేకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వాటి ద్వారా ఈ-ఓటరు కార్డులను జారీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం రూపొందిస్తున్న ప్రత్యేక పోర్టల్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ఓటరు మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేస్తే ఈ-ఓటరు కార్డు ప్రింట్‌ తీసుకునేందుకు వెసులుబాటు లభిస్తుందని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది.

Read Also… CM Jagan Emergency Meeting: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అత్యవసర సమావేశం.. హైకోర్టు కీలక తీర్పుపై చర్చ