కరోనా మ‌ర‌ణ మృదంగం.. ఢిల్లీ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లింది ఎంత‌మంది..?

మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు తెలంగాణ నుంచి వెళ్లిన వారి జాబితాను తాజాగా అధికారులు గుర్తించారు. ఆ లిస్టును చూస్తే..క‌రోనా ఏ స్థాయిలో విరుచుకుప‌డుతుందోన‌నే భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి...

కరోనా మ‌ర‌ణ మృదంగం.. ఢిల్లీ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లింది ఎంత‌మంది..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 31, 2020 | 6:28 PM

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు సంచ‌ల‌నంగా మారాయి.. విదేశాల నుంచి కరోనాను తీసుకొచ్చిన వారికంటే ఆ ప్రార్థనల్లో పాల్గొన్న వారిద్వారానే ఎక్కువ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల తర్వాత ఈ సంఖ్య వేలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు తెలంగాణ నుంచి వెళ్లిన వారి జాబితాను తాజాగా అధికారులు గుర్తించారు. ఆ లిస్టును చూస్తే..క‌రోనా ఏ స్థాయిలో విరుచుకుప‌డుతుందోన‌నే భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
అది దేశ‌రాజ‌ధాని ఢిల్లీ..నిజాముద్దీన్ ప్రాంతంలోని మ‌ర్క‌జ్ ప్రార్థ‌నా మందిలో దాదాపు నెల రోజులు మార్చి 15 వ‌ర‌కు అక్క‌డ మ‌త ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ఆ ప్రార్థ‌న‌ల్లో దేశ‌వ్యాప్తంగా సుమారు 2వేల‌కు పైగా ప్ర‌జ‌లు పాల్గొన్నారు. నెల‌రోజుల పాటు జ‌రిగిన ఈ ప్రార్థ‌న‌ల కార్య‌క్ర‌మానికి దేశం న‌లుమూల‌ల నుంచి ఎంతోమంది హ‌జ‌ర‌య్యారు. చివ‌రి రోజుల్లో ఇక్క‌డికి వ‌చ్చిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్‌గా తేలింది. కాగా, తెలంగాణలో ఇప్పటికే పలు పాజిటివ్ కేసులునమోదు కాగా.. ఆరుగురు చనిపోయారు.
అటు ఏపీలో ఇవాళ ఒక్క రోజే 17 కొత్త కేసులు నమోదు కాగా.. వారందరితో మర్కజ్ ప్రార్థనలతో లింక్ ఉన్న‌ట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై.. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారిపై ప్రత్యేక దృష్టిపెట్టి వివరాలు సేకరించింది. తెలంగాణ నుంచి మొత్తం 1,030 మంది  మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వారంద‌ర్ని క‌రోనా వైర‌స్ అనుమానితులుగా భావిస్తున్నారు. వారిలో చాలా మందిని ఇప్పటికే ఆస్పత్రులకు తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.