ఢిల్లీలో అతి పెద్ద కోవిద్-19 సెంటర్ ని సీఎం అరవింద్ కేజ్రీవాల్, హోంమంత్రి అమిత్ షా శనివారం సందర్శించారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద కోవిద్ సెంటర్ అంటున్నారు. చత్తర్ పూర్ ఏరియాలో దాదాపు 12 లక్షల 50 వేల చదరపు అడుగుల స్థలంలో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ హాస్పిటల్ లో రెండు వేల బెడ్స్ ఉన్నాయి. అయితే మరి కొన్ని రోజుల్లో దీన్ని పదివేల పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ఇందులో పారా మిలిటరీ, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు శాఖకు చెందిన డాక్టర్లు, హెల్త్ వర్కర్లు పని చేయనున్నారు. శుక్రవారం దీనిని ప్రారంభించగా.. కేజ్రీవాల్, అమిత్ షా శనివారం విజిట్ చేసి ఆయా వార్డుల్లోని విశేషాలను తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఆర్మీకి చెందిన రెండువేల మంది డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఈ కోవిద్ సెంటర్ లో పని చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ నగరంలో కరోనా వైరస్ కేసులు పెరిగి పోతుండడంతో ఉన్న ఆస్పత్రులు చాలక ఈ అతి పెద్ద కోవిద్ సెంటర్ ని ప్రభుత్వం యుధ్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసింది.