ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 పంజా విసురుతోంది. దేశాధిపతులు, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు, సినీ సెలబ్రిటీలు అందరూ వైరస్ బారినపడుతున్నారు. ఇటీవల పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ ఆఫ్రిదితో పాటు మరో ఇద్దరు పాకిస్థానీ క్రికెటర్లకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ నఫీస్ ఇక్బాల్‌కు కరోనా మహమ్మారి సోకింది.
2003 నుంచి 2006 మధ్య బంగ్లాదేశ్ ఓపెనర్‌గా ఉన్న నఫీస్‌కు వైరస్ సోకినట్లు శనివారం నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సోదరుడే నఫీస్ ఇక్బాల్. 11 టెస్టులు, 16 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటికే బంగ్లాదేశ్ డెవలప్‌మెంట్ కోచ్ అషీఖుర్ రహమాన్‌కు కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఇదిలా ఉంటే, వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ నిరవధికంగా వాయిదా పడగా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది.