కరోనా కట్టడి ప్రాణం తీసింది.. వ్యక్తి దారుణ హత్య

కరోనా కట్టడి పేరిట గ్రామాల్లో విధించుకుంటున్న స్వీయరక్షణ చర్యలకు జంతువుల వేట తోడవడం అనంతపురం జిల్లాలో ఒకరి దారుణ హత్యకు దారితీసింది. లాక్ డౌన్ సమయంలో తమ గ్రామంలోకి ఎవరు రావద్దంటూ కట్టడి విధించుకున్న గ్రామం ఒకవైపు.. ఆ కట్టడిని తొలగించి జంతువుల వేటకు పూనుకున్న వర్గం ఇంకోవైపు....

కరోనా కట్టడి ప్రాణం తీసింది.. వ్యక్తి దారుణ హత్య
Follow us

|

Updated on: Apr 06, 2020 | 1:27 PM

కరోనా కట్టడి పేరిట గ్రామాల్లో విధించుకుంటున్న స్వీయరక్షణ చర్యలకు జంతువుల వేట తోడవడం అనంతపురం జిల్లాలో ఒకరి దారుణ హత్యకు దారితీసింది. లాక్ డౌన్ సమయంలో తమ గ్రామంలోకి ఎవరు రావద్దంటూ కట్టడి విధించుకున్న గ్రామం ఒకవైపు.. ఆ కట్టడిని తొలగించి జంతువుల వేటకు పూనుకున్న వర్గం ఇంకోవైపు.. వెరసి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దాంతో రెండు వర్గాలు కత్తులు, బరిశెలతో పరస్పరం దాడులకు దిగడంతో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.

పగలకు, కక్ష సాధింపులకు మారుపేరుగా చెప్పుకునే రాయలసీమలోని అనంతపురం జిల్లాల్లో దారుణం జరిగింది. బత్తల పల్లి మండలం ఈదుల ముష్టూరు గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. లాక్ డౌన్ కారణంగా తమ గ్రామంలోకి, మరీ ముఖ్యంగా తమ వీధిలోకి కొత్త వ్యక్తులెవరు రావద్దంటూ ఓ వర్గం వీధిలోకి ఎంటరయ్యే దారులపై కంచెలు వేసుకుంది. మరోవైపు ఆ కంచెలను తొలగించి.. అదేదారిలోకి పొలాల్లోకి వెళ్ళి కుందేళ్ళ వేటకు మరో వర్గం మాటువేసింది.

ఆరోగ్యం కోసం, తమ వీధిలోకి మనుషు ప్రాణాల కోసం తాము కంచె వేసుకుంటే కుందేళ్ళ వేట పేరిట వాటిని తొలగించడం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దాంతో రెండు వర్గాల వారు పరస్పరం దాడులకు దిగారు. రాళ్ళు, కత్తులు, బరిశెలతో ఒక వర్గం మరో వర్గం వారిపై దాడులకు తెగబడింది. రెండు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఈదుల ముష్టూరు గ్రామానికి చెందిన కాటమయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని బత్తలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.