
హైదరాబాద్, నవంబర్ 8: డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు కీలక అప్డేట్. రెగ్యులర్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2) నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు త్వరలో శుభవార్త అందనుంది. ఈ నెలాఖరులో టెట్-2 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనవరిలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. సాధారణంగా గతంలో నవంబరు మొదటి వారంలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేవారు. అయితే ఈసారి ప్రకటన జారీలో కొంత జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రెండో టెట్ పరీక్షలను నవంబరు 16 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల షెడ్యూల్ నేపథ్యంలో రెగ్యులర్ టెట్ నోటిఫికేషన్ విడుదల ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.
డీఎడ్, బీఎడ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు రెగ్యులర్ టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో అధికారిక ప్రకటన విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన అనంతరం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. టెట్-2 పరీక్షలను వచ్చే ఏడాది జనవరిలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పరీక్షల తేదీలు, దరఖాస్తుల గడువు, ఫీజు వివరాలు, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడికానున్నాయి.
టెట్-2 కోసం సిద్ధమవుతున్న డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలకు ముందే తమ విద్యార్హతలు, అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవడం మంచిది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్ష తేదీలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ విడుదల తేదీ, పరీక్షల షెడ్యూల్ ప్రస్తుత సమాచారం ఆధారంగా తెలియజేశాం. తుది వివరాల కోసం అధికారిక ప్రకటనను పరిశీలించాలి.