
హైదరాబాద్, అక్టోబర్ 17: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం. స్టేషన్ మాస్టర్ పోస్టుల ప్రత్యక్ష నియామకానికి కనీస వయోపరిమితిని రైల్వే బోర్డు పెంచింది. ఇప్పటివరకు 18 ఏళ్లుగా ఉన్న కనీస వయసును 20 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ అక్టోబరు 7 నుంచి అమల్లోకి వచ్చినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. స్టేషన్ మాస్టర్ పోస్టుకు గతంలో ఇండియన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ మాన్యువల్ ప్రకారం 18 నుంచి 30 ఏళ్ల వరకు వయోపరిమితి ఉండేది. తాజాగా కనీస వయసును 18 నుంచి 20 ఏళ్లకు పెంచుతూ బోర్డు నిబంధనలను సవరించింది. ఈ మేరకు అక్టోబరు 7న జారీ చేసిన అధికారిక లేఖను అన్ని జోనల్ రైల్వేలు, ఉత్పత్తి యూనిట్ల జనరల్ మేనేజర్లతో పాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల (RRB) ఛైర్పర్సన్లకు పంపించింది. ఈ మార్పు లేఖ జారీ చేసిన తేదీ నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
స్టేషన్ మాస్టర్ పోస్టుల నియామకాలకు సంబంధించి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైన కేసులకు మాత్రం పాత నిబంధనలే వర్తిస్తాయని రైల్వే బోర్డు తెలిపింది. అంటే, సంబంధిత కేంద్ర స్థాయి ఉద్యోగ ప్రకటన (Centralised Employment Notification) ఇప్పటికే విడుదలైన నియామకాలను గతంలో ఉన్న నియమాల ప్రకారమే కొనసాగిస్తారు. అభ్యర్థులు కొత్త వయోపరిమితిని గమనించడంతో పాటు, తాము దరఖాస్తు చేసే నియామక ప్రకటనలో పేర్కొన్న నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి. రైల్వే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ (AISMA) స్వాగతించింది. ఇది తమ సంఘం చాలాకాలంగా కోరుతున్న డిమాండ్ అని సంఘం ప్రధాన కార్యదర్శి శరద్ చంద్ర పురోహిత్ తెలిపారు.
స్టేషన్ మాస్టర్ పోస్టుకు కనీస విద్యార్హత డిగ్రీ కావడంతో, అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే సమయానికి సాధారణంగా 20 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసుకు చేరుకుంటారని ఆయన వివరించారు. 18 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉండటం సాధ్యం కాదని, అందువల్ల కనీస వయోపరిమితిని 20 ఏళ్లకు పెంచడం విద్యార్హతకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. స్టేషన్ మాస్టర్ల పని పరిస్థితులకు సంబంధించిన పలు అంశాలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు తమ సంఘం గతంలో లేఖ రాసిందని పురోహిత్ తెలిపారు. కనీస వయోపరిమితిని పెంచుతూ రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయం సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు స్టేషన్ మాస్టర్ పోస్టుకు కనీస వయసు 20 ఏళ్లకు పెరిగింది. అయితే ఇప్పటికే కేంద్ర స్థాయి ఉద్యోగ ప్రకటన విడుదలైన నియామకాలకు పాత నిబంధనలే వర్తిస్తాయి. కాబట్టి దరఖాస్తు చేసే ముందు సంబంధిత RRB అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించాలి.