
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముగియడంతో మెడిసిన్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థుల దృష్టంతా ఇప్పుడు మే 3న జరగనున్న నీట్ పరీక్షపైనే ఉంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ రాయడానికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇప్పుడున్న ఈ ఐదు వారాల సమయం అత్యంత కీలకం. సీట్లు వేలల్లో ఉంటే, పోటీ పడే అభ్యర్థులు లక్షల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే.. ఈ చివరి రోజుల్లో చేసే కసరత్తు మరొక ఎత్తు. ప్రతి విద్యార్థి తమ వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక రూపొందించుకుంటే మంచి స్కోరుతో పాటు కోరుకున్న మెడికల్ కాలేజీలో సీటు సాధించే అవకాశం ఉంటుంది.
నీట్ పరీక్షా సరళి గతం కంటే కఠినంగా మారుతుంది. ముఖ్యంగా కొవిడ్ తర్వాతి కాలం నుండి ప్రశ్నల స్థాయి సులభం నుండి మోడరేట్, కఠినంగా ఉండే స్థాయికి చేరాయి. 2024తో పోలిస్తే 2025లో ప్రశ్నలు మరింత క్లిష్టంగా వచ్చాయి. సబ్జెక్టుల వారీగా చూస్తే, ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉండి కాలిక్యులేషన్స్‌కు ఎక్కువ సమయం పట్టింది. కెమిస్ట్రీ పూర్తిగా ఎన్‌సీఈఆర్‌టీ ఆధారితంగా ఉన్నప్పటికీ.. బయాలజీలో వాడిన పదాలు కొత్తగా, క్లిష్టంగా ఉండటంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ మార్పుల వల్లే గత ఏడాది కటాఫ్ మార్కులు కూడా తగ్గాయి. ఈ పరిణామాలను గమనిస్తూ అభ్యర్థులు తమ ప్రిపరేషన్ వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.
ఫిజిక్స్‌లో మోడ్రన్ ఫిజిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్ వంటి సులభమైన విభాగాలపై పట్టు సాధిస్తూనే, మెకానిక్స్, ఎలక్ట్రిసిటీలో మల్టీ-స్టెప్ థింకింగ్ అవసరమయ్యే ప్రశ్నలను విశ్లేషించడం నేర్చుకోవాలి. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ విభాగానికి ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలే కీలకం. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములా సబ్‌స్టిట్యూషన్‌పై పట్టు సాధించాలి. బయాలజీ సులభం అనిపించినా, ఆప్షన్ల మధ్య సిమిలారిటీ ఎక్కువగా ఉండటం వల్ల మిస్-రీడింగ్ జరగకుండా జాగ్రత్త పడాలి. పరీక్షా సమయంలో మొదట బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ, చివరగా ఫిజిక్స్ అటెంప్ట్ చేయడం వల్ల సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు.
చివరి దశలో భాగంగా విద్యార్థులు ముందుగా సెకండియర్ చాప్టర్లను, ఆ తర్వాత ఫస్టియర్ అంశాలను రివైజ్ చేయాలి. సాధ్యమైనన్ని మాక్ టెస్టులు రాయడం, ముఖ్యంగా ఏప్రిల్ రెండో వారం నుండి ప్రతిరోజూ ఒక ఫుల్ లెంగ్త్ టెస్ట్ రాయడం తప్పనిసరి. ఎన్టీఏ వెబ్‌సైట్‌లోని మాక్ టెస్టులతో పాటు గత ఐదేళ్ల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ప్రతి పరీక్ష తర్వాత తప్పులను విశ్లేషించుకుంటూ.. సందేహాలు ఉంటే వెంటనే లెక్చరర్ల ద్వారా నివృత్తి చేసుకోవాలి. గెస్ వర్క్ జోలికి వెళ్లకుండా, నెగటివ్ మార్కింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఖచ్చితమైన సమాధానాలను గుర్తించడం ద్వారా నీట్ మెడికల్ సీటును సొంతం చేసుకోవచ్చు.