మీ పిల్లలు 5వ తరగతి పాసయ్యారా..? అయితే, 2వ తరగతి పుస్తకం చదవగలరా?

ఐదో తరగతి పాసైన పిల్లలు రెండో తరగతి పాఠ్యపుస్తకాన్ని చదవగలుగుతున్నారా? దేశంలో ప్రాథమిక విద్యా ప్రమాణాలు, పిల్లల్లో చదవడం, గణిత నైపుణ్యాల లోపాలను ASER నివేదిక వెల్లడిస్తోంది. లెర్నింగ్ పావర్టీ అంటే ఏమిటి? నిపుణ్ భారత్ మిషన్ లక్ష్యాలేంటి? తల్లిదండ్రులు పిల్లల అభ్యాస సామర్థ్యాన్ని ఎలా గుర్తించాలి?

మీ పిల్లలు 5వ తరగతి పాసయ్యారా..? అయితే, 2వ తరగతి పుస్తకం చదవగలరా?
Learning Poverty In India

Edited By:

Updated on: Nov 01, 2026 | 11:12 AM

మనవడు లేదా మనవరాలు 5వ తరగతి రిపోర్ట్ కార్డును ఇంటికి తీసుకురాగానే ఒక అమ్మమ్మ ఆనందంతో ఉప్పొంగుతుంది. ఐదేళ్లు బడికి వెళ్లి ఉత్తీర్ణత సాధించిన పిల్లాడు ధైర్యంగా చదవగలడు, ప్రాథమిక లెక్కలు చేయగలడు అని ఆమె సహజంగానే భావిస్తారు. కానీ, భారతదేశం వ్యాప్తంగా ఈ నమ్మకం వాస్తవానికి చాలా దూరంగా ఉంటోంది. విద్యా రంగ పరిశోధకులు గత రెండు దశాబ్దాలుగా దీనిని ఒక తీవ్రమైన సమస్యగా గుర్తిస్తున్నారు.. అదే ‘లెర్నింగ్ పావర్టీ’ (అభ్యాస పేదరికం)..

గ్రామీణ భారతదేశంలోని పిల్లలు పాఠశాలల్లో కేవలం ఏ తరగతిలో చదువుతున్నారనే దానికంటే.. వాస్తవంగా వారు ఏమి చేయగలరు అనే అంశంపై ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నిర్వహించే ‘అసర్’ (ASER – Annual Status of Education Report) సర్వే అనేక సంచలన నిజాలను వెల్లడించింది.

గణాంకాలు ఏం చెబుతున్నాయి? – నిరాశాజనక వాస్తవాలు:

గణితంలో వెనుకబాటు: 5వ తరగతి చదువుతున్న సుమారు 70 శాతం మంది విద్యార్థులు తమ గ్రేడ్ స్థాయికి తగిన సాధారణ అంకగణిత లెక్కలను కూడా చేయలేకపోతున్నారు.

చదవలేని స్థితి: 3వ తరగతి చదువుతున్న పిల్లల్లో 76.6 శాతం మంది 2వ తరగతి స్థాయి పాఠాన్ని కూడా అనర్గళంగా చదవలేకపోతున్నారు. ప్రతి ముగ్గురు మూడో తరగతి పిల్లల్లో ఇద్దరు సాధారణ వ్యవకలనం (Substraction – తీసివేతలు) చేయలేకపోతున్నారు.

ఇది పిల్లల సోమతనం లేదా తెలివితేటల లోపం వల్ల జరుగుతున్నది కాదు. విద్యార్థులకు పునాది నైపుణ్యాలు వచ్చాయా లేదా అని చూడకుండా.. కేవలం వయసు, అకడమిక్ క్యాలెండర్ ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్న మన విద్యా విధానపు లోపం ఇది. 2వ తరగతిలో సరిగ్గా చదవడం రాని పిల్లాడు అలాగే 3, 4, 5 తరగతులకు వెళ్తుంటాడు. దీంతో ఏడాదకోసారి ఆ లోపం మరింత పెరుగుతూ పోతుంది.

ఆశావహ దృక్పథం – కొద్దిగా మారుతున్న చిత్రణ:

అయితే ఈ డేటాలోనే చిన్న సానుకూలత కూడా ఉంది. 2022 తో పోలిస్తే తాజా సర్వే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 2వ తరగతి స్థాయి టెక్స్ట్‌ను చదవగలిగే 3వ తరగతి విద్యార్థుల శాతం 16.3% నుండి 23.4%కి పెరిగింది. కొన్ని రాష్ట్రాలు రెండేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించాయి.

ముందంజలో ఉన్న రాష్ట్రాలు: గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు 10 శాతానికి పైగా మెరుగుదల కనబరిచాయి.

వెనుకబడిన ప్రాంతాలు: హిమాచల్ ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలలో కేవలం 4 నుండి 5 శాతం మాత్రమే వృద్ధి కనిపించింది. దీనిని బట్టి దేశవ్యాప్తంగా విద్యా పునరుద్ధరణ సమానంగా లేదని స్పష్టమవుతోంది.

‘నిపుణ్ భారత్’ లక్ష్యం – మారుతున్న విధానాలు:

ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో కీలక మార్పులు తెచ్చింది. విద్యార్థులు పై తరగతులకు వెళ్లే ముందే.. అంటే 3వ తరగతి ముగిసేసరికి ప్రతి ఒక్కరూ భావగ్రహణతో చదవడం, ప్రాథమిక లెక్కలు చేయడం నేర్చుకోవాలనే లక్ష్యంతో ‘నిపుణ్ భారత్’ (NIPUN Bharat) మిషన్‌ను తీసుకువచ్చింది. ఎక్కడైతే ఈ విధానాన్ని సీరియస్‌గా అమలు చేస్తున్నారో అక్కడ మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.

తల్లిదండ్రులు చేయాల్సిందేంటి?

మార్కులు నిండిన రిపోర్ట్ కార్డును చూసి తల్లిదండ్రులు సంతోషపడిపోతే సరిపోదు. దాన్ని దాటి క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించాలి.

మీ పిల్లలకు వారి తరగతి కంటే రెండు తరగతులు వెనక ఉన్న చిన్న పుస్తకాన్ని ఇచ్చి చదవమని అడగండి. ఎలాంటి సహాయం లేకుండా ఒక సాధారణ తీసివేత లెక్క చేయమనండి.

దీనివల్ల కొన్ని నిమిషాల్లోనే అసలు వాస్తవం బయటపడుతుంది. ఒకవేళ పిల్లలు ఇబ్బంది పడితే, దానిని స్కూలు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి ఎక్కడ లోపం ఉందో సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.

పాఠశాలల్లో హాజరు, పరీక్షల మార్కులు మాత్రమే విజయానికి కొలమానం కావు.. ఆ పిల్లలు చదివిన చదువును నిజంగా గ్రహించగలుగుతున్నారా లేదా అనేదే అసలైన విజయం..

Loading...
Unable to load recommendations.
Follow Us