
ప్రస్తుతం ఒడిశా కేడర్‌లో ఐపీఎస్ గా సేవలందిస్తున్న గుండాలరెడ్డి రాఘవేంద్రకు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘ఫేమ్ ఇండియా – ఆసియా పోస్ట్’ సంయుక్తంగా ఎంపిక చేసిన టాప్ 25 పోలీస్ ఆఫీసర్స్ 2026 జాబితాలో చోటు సంపాదించారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటికి చెందిన గుండాలరెడ్డి రాఘవేంద్ర 2019 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి. సివిల్స్ ప్రయాణంలో ఎన్నో వైఫల్యాలు ఎదురైనా లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. ఐదుసార్లు మెయిన్స్, మూడుసార్లు ఇంటర్వ్యూలో నిరాశ ఎదురైనా వెనుకడుగు వేయకుండా ప్రయత్నం కొనసాగించారు. చివరకు ఆరో ప్రయత్నంలో 180వ ర్యాంకుతో ఐపీఎస్ సాధించి తన కలను నిజం చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఒడిశాలోని బల్లిగుడ ఎస్డీపీఓగా బాధ్యతలు చేపట్టిన రాఘవేంద్ర.. అనంతరం సమస్యాత్మక ప్రాంతంగా పేరొందిన నువాపడ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ నక్సల్స్ కార్యకలాపాలను అడ్డుకోవడంలో సమర్థంగా పనిచేశారు. విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలు, వ్యూహాత్మక నైపుణ్యాలకు గుర్తింపుగా కేంద్ర హోంశాఖ నుంచి ‘దక్షత’ పేరిట ప్రత్యేక పతకాన్ని అందుకున్నారు.
ప్రస్తుతం ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న రాఘవేంద్ర శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. అక్రమ కార్యకలాపాల నియంత్రణతోపాటు నేరాల కట్టడికి వినూత్న చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆటోలు, ట్యాక్సీలకు క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీంతో ప్రయాణికుల రక్షణకు భరోసా కల్పించడంతోపాటు డ్రైవర్ల బాధ్యతను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌తోపాటు ప్రజలతో మమేకమయ్యే సామాజిక కార్యక్రమాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. నేరాల నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తూనే ప్రజలకు అందుబాటులో ఉండే అధికారిగా గుర్తింపు పొందుతున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలోనే రాఘవేంద్ర తన ప్రతిభను చాటుకున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ‘అవుట్‌స్టాండింగ్ ప్రొబేషనర్’గా నిలిచారు. గంజాం జిల్లాలో ప్రొబేషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ అత్యాచార కేసును వేగంగా, సమర్థంగా దర్యాప్తు చేయడం ద్వారా తన వృత్తి నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.
విధి నిర్వహణలో నిబద్ధత, నేరాల నియంత్రణలో సమర్థత, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలు, సాంకేతికత ఆధారిత పోలీసింగ్ వంటి అంశాల్లో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ‘ఫేమ్ ఇండియా – ఆసియా పోస్ట్’ టాప్ 25 పోలీస్ ఆఫీసర్స్ 2026 జాబితాలో రాఘవేంద్రకు చోటు దక్కింది. ఈ జాతీయ గుర్తింపును తన వ్యక్తిగత విజయంగా కాకుండా తోటి అధికారులు, పోలీసు సిబ్బంది సమష్టి కృషికి దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించడం విశేషం. వైఫల్యాలను చూసి వెనక్కి తగ్గకుండా లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తే విజయం సాధ్యమేనని రాఘవేంద్ర ప్రయాణం నిరూపిస్తోంది. సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండటమే తన విజయ రహస్యమని చెప్పే ఈ యువ ఐపీఎస్ అధికారి ప్రస్థానం ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం.