నెలల తరబడి ఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టూ.. డచ్‌ CEO నుంచి జాబ్‌ ఆఫర్‌!

ఒక వ్యక్తి తలచుకుంటే మార్పు తీసుకురావడం ఎంతవరకు సాధ్యమో మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు నిరూపిస్తున్నాడు. కలుషితమైన నదిని శుభ్రం చేసేందుకు ఎలాంటి పెద్ద సంస్థల అండ లేకపోయినా.. నెలల తరబడి ఒంటరిగానే చెత్తను తొలగిస్తూ తన వంతు కృషి చేశాడు. ఇప్పుడు అతడి సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది...

నెలల తరబడి ఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టూ.. డచ్‌ CEO నుంచి జాబ్‌ ఆఫర్‌!
Bittu Tabahi Gets Job Offer From The Ocean Cleanup

Updated on: Sep 06, 2026 | 10:32 AM

భోపాల్, సెప్టెంబర్ 6:  మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్ చౌదరి, సోషల్ మీడియాలో ‘బిట్టు తబాహీ’గా గుర్తింపు పొందాడు. స్థానికంగా తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిను శుభ్రం చేసేందుకు ఆయన నెలలుగా నిరంతరం పనిచేస్తున్నాడు. నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త, ఇతర వ్యర్థాలను స్వయంగా తొలగించడంతో పాటు.. నది పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాలను కూడా శుభ్రం చేస్తున్నాడు.

ఎవరి సహాయం లేకుండానే..

సురేంద్ర చేపట్టిన ఈ కార్యక్రమం వెనుక పెద్ద పర్యావరణ సంస్థ లేదు. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగానూ ఆయన ఈ పని చేయడం లేదు. ఎలాంటి భారీ ప్రచారం లేకుండా తనకు చేతనైనంత మేరకు నదిని శుభ్రం చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగాడు. చెత్తను తొలగించేందుకు అవసరమైన ప్రాథమిక సామగ్రిని కూడా తన సొంత డబ్బుతో కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత ప్రతిరోజూ నది వద్దకు వెళ్లి చెత్తను తొలగిస్తూ వచ్చాడు. తాను చేపట్టిన శుభ్రత కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సురేంద్ర సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ముఖ్యంగా అజ్నార్ నది ‘ముందు–తర్వాత’ చిత్రాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. మొదటి ఫొటోలో నది నీరు, పరిసర ప్రాంతాలు ప్లాస్టిక్‌, చెత్తతో నిండిపోయి కనిపించాయి. అయితే సురేంద్ర నెలల తరబడి చేసిన కృషి తర్వాత తీసిన మరో ఫొటోలో అదే ప్రాంతం ఎంతో శుభ్రంగా కనిపించింది. ఈ రెండు చిత్రాలు ఒక్క వ్యక్తి పట్టుదలతో ఎంతటి మార్పు తీసుకురాగలడో స్పష్టంగా చూపించాయి.

ఇవి కూడా చదవండి

నెదర్లాండ్స్‌ సీఈవో నుంచి జాబ్‌ ఆఫర్..

సురేంద్ర చేస్తున్న ఈ సేవా కార్యక్రమం చివరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు సముద్రాలు, నదుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే The Ocean Cleanup సంస్థ అధినేత, డచ్ వ్యాపారవేత్త బోయన్ స్లాట్ దృష్టిని ఆకర్షించింది. సురేంద్ర కథను ఓ ఎక్స్‌ (X) యూజర్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 20 ఏళ్ల యువకుడు నెలలుగా ఒంటరిగానే తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిని శుభ్రం చేస్తున్నాడని, అందుకు సంబంధించిన ముందు–తర్వాత ఫొటోలను కూడా అందులో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌పై బోయన్ స్లాట్ స్పందిస్తూ కేవలం రెండు మూడు పదాల్లోనే ఓ ఆహ్వానం ఇచ్చారు.

‘Come work with us’ (మాతో కలిసి పనిచేయండి) అని సురేంద్రను ఆహ్వానించారు. సురేంద్ర తన చుట్టూ ఉన్న నదిని శుభ్రం చేయాలనే చిన్న ప్రయత్నంతో ప్రారంభించిన పని ఇప్పుడు అతడికి అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఎలాంటి పెద్ద సంస్థ అండ లేకుండా, ప్రచారం కోసం ఎదురుచూడకుండా, తన సొంత డబ్బుతో అవసరమైన సామగ్రిని సమకూర్చుకుని నెలల తరబడి నదిని శుభ్రం చేసిన సురేంద్ర పట్టుదల ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఒక పెద్ద మార్పు కోసం పెద్ద బృందం అవసరం లేదని.. మార్పు తీసుకురావాలనే సంకల్పం ఉంటే ఒక్క వ్యక్తి కూడా ఎంతో చేయగలడని సురేంద్ర కథ మరోసారి నిరూపించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us