
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న న్యాయ విద్యలో అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ పరిధిలో మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ నంబర్ 118/2026-RC ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడిషియల్ (సర్వీస్ & కేడర్) నిబంధనలు, 2026 ప్రకారం నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 30, 2026లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు వేతనం లభించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులను రెండు విధాలుగా భర్తీ చేయనున్నారు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ 96 పోస్టులు, బదిలీ ద్వారా నియామకం 23 పోస్టులు ఉన్నాయి.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో (లా) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే హైకోర్టు సర్వీస్, జిల్లా న్యాయవ్యవస్థ, ప్రాసిక్యూషన్ సర్వీస్ లేదా సంబంధిత ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అర్హులు. బదిలీ ద్వారా నియామకం పోస్టులకు లా డిగ్రీ కలిగి ఉండాలి. హైకోర్టు సిబ్బంది, జిల్లా జ్యుడిషియరీ, ప్రాసిక్యూషన్ సర్వీసులు లేదా సంబంధిత విభాగాల్లో కన్ఫర్మ్డ్ సభ్యులు లేదా ఆమోదిత ప్రొబేషనర్లుగా పనిచేస్తున్నవారు అర్హులు. 2026 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 35 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కేటగిరీల వారీగా పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 30, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు పే స్కేల్ ఉంటుంది. ఇతర అలవెన్సులు, సర్వీస్ ప్రయోజనాలు వర్తించే నిబంధనల ప్రకారం లభిస్తాయి.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్.. మొదట కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది. ఇందులో కనీసం 40 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను 1:10 నిష్పత్తిలో రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్ష.. స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మూడు పేపర్లలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. పేపర్-1: సివిల్ లాస్ (Civil Laws), పేపర్-2: క్రిమినల్ లాస్ (Criminal Laws), పేపర్-3: ఇంగ్లీష్ (అనువాదం, వ్యాస రచన) ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
సివిల్ జడ్జి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జ్యుడిషియల్ అకాడమీలో ఏడాది పాటు ఇంటెన్సివ్ శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం ఏడాది పాటు లా క్లర్క్‌షిప్ పూర్తి చేయాలి. ఈ శిక్షణ ద్వారా న్యాయపరమైన విధులు, కోర్టు నిర్వహణ, న్యాయ ప్రక్రియలపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తారు.
ఏపీ హైకోర్టులో ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.