కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ పొందడం ఇప్పుడంతా ఈజీ కాదు! మూడు గండాలు దాటాలి!

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ ఏప్రిల్ 1 నుండి కఠినతరం కానుంది. ఎల్‌ఎల్‌ఆర్ దరఖాస్తుకు ముందు ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాడ్యూల్స్ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, డ్రైవర్లలో భద్రతా అవగాహన పెంపొందించడమే ఈ కొత్త విధానం లక్ష్యం. ఇది లైసెన్స్ జారీని మరింత పారదర్శకంగా, ప్రమాణాలతో కూడినదిగా మారుస్తుంది.

కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ పొందడం ఇప్పుడంతా ఈజీ కాదు! మూడు గండాలు దాటాలి!
Driving License

Updated on: Mar 22, 2026 | 8:30 PM

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ రాష్ట్ర రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మార్పుల ప్రకారం ఇప్పటివరకు అమలులో ఉన్న లెర్నర్ లైసెన్స్ (ఎల్‌ఎల్‌ఆర్) పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్‌తో పాటు, ఇకపై మరో అదనపు పరీక్షను తప్పనిసరి చేశారు. కొత్త విధానం ప్రకారం అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాడ్యూల్స్‌కు సంబంధించిన పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత మాత్రమే వారు ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో ఇది తొలి దశగా మారనుంది. ఆ తర్వాత ఎల్‌ఎల్‌ఆర్ పరీక్ష, తదుపరి డ్రైవింగ్ టెస్ట్ సాధారణ విధానంలోనే కొనసాగుతాయి.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమేనని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. చాలా మంది డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అందుకే లైసెన్స్ ఇచ్చే ముందు అభ్యర్థులకు తప్పనిసరిగా రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రత్యేకంగా యువతలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆన్‌లైన్ మాడ్యూల్స్ ద్వారా ట్రాఫిక్ రూల్స్, రోడ్డు వినియోగం, ప్రమాదాల నివారణ వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించబడుతుంది. ఇది కేవలం పరీక్ష మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌కు అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని అందించే విధంగా రూపొందించబడినట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ మరింత పారదర్శకంగా, ప్రమాణాలతో కూడినదిగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా, దీర్ఘకాలంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషించే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us