
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రుణగ్రహీతలకు మరో షాకిచ్చేందుకు సిద్దమవుతోంది. వడ్డీ రేట్లను మరోసారి పెంచాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిసెంబర్లో జరగనున్న ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. డిసెంబర్ 4వ తేదీన ఈ సమావేశం జరగనుంది. ఈ సమవేశంలో రెపో రేటును 0.50 శాతం పెంపుపై నిర్ణయం ఉండొచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నోమురా అంచనా వేసింది.

ఒకవేళ 50 బేసిస్ పాయింట్లు పెంచితే రెపో రేటు 6 శాతానికి చేరుకోనుంది. గతంలో 0.25 శాతం పెంచవచ్చని అంచనా వేసిన నోమురా సంస్థ.. ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు తన అంచనాలను మరింత పెంచింది. 50 బేసిస్ పాయింట్లు పెంచేందుకు 60 శాతం అవకాశం ఉందని తాజా నివేదికల్లో పేర్కొంది. ఇక 25 బేసిస్ పాయింట్లు పెంచేందుకు 40 శాతం అవకాశం ఉందని స్పష్టం చేసింది.

వడ్డీ రేట్లను 2027 క్యాలెండర్ సంవత్సరం రెండవ త్రైమాసికం నాటికి మరో 75 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ రీసెర్చ్ నివేదిక ఇటీవల అంచనా వేసింది. పెరుగుతున్న ఆహార ధరలు, విస్తరిస్తున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కేంద్ర బ్యాంకు కఠినమైన ద్రవ్య విధానాన్ని అవలంబించడానికి కారణం కావచ్చని ఈ నివేదిక అభిప్రాయపడింది. డిసెంబర్ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల పెంపు ఉండవచ్చని ఈ సంస్థ పేర్కొంది.

2027 మొదటి అర్ధభాగంలో మరో 50 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. ఈ పెంపులతో రెపో రేటు 6.25 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే.. రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు భారంగా మారతాయి. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టేవారికి మెరుగైన వడ్డీ రేట్లతో ప్రయోజనం చేకూరవచ్చు.

ఈ ఏడాదిలో ఇప్పటికే ఒకసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. గత సమావేశంలో 25 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు న్యూఇయర్‌కు ముందే ఈఎంఐలు చెల్లించేవారికి మరో షాకిచ్చేందుకు ఆర్బీఐ రెడీ అవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరి ఆర్బీఐ పెంచుతుందా.. లేదా అనేది చూడాలి.