కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..

డబ్బులు సంపాదించడం ఒకెత్తయితే.. సంపాదించిన డబ్బును రూపాయి రిస్క్ లేకుండా దాచుకోవడం మరో ఎత్తు. చాలామంది సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం బ్యాంకు ఎఫ్‌డీలను నమ్ముకుంటారు. కానీ మీ అసలు అలాగే ఉండి.. ఐదేళ్ల పాటు ప్రతి నెలా మీ అకౌంట్‌లోకి జీతం లాగా డబ్బులు పడేలా చేసే ఒక పవర్‌ఫుల్ ప్రభుత్వ పథకం ఉందని మీకు తెలుసా? ఆ పథకం గురించి తెలుసుకుందాం..

కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..
Post Office Monthly Income Scheme

Updated on: Jun 02, 2026 | 12:17 PM

మధ్యతరగతి ప్రజలకు, రిటైర్డ్ ఉద్యోగులకు సురక్షితమైన పెట్టుబడి అనగానే గుర్తొచ్చేది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి బ్యాంకు ఎఫ్‌డీల కంటే కూడా పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఒక క్రేజీ స్కీమ్ సూపర్ ఆప్షన్‌గా నిలుస్తోంది. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. ఈ పథకంలో మీ డబ్బుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుంది. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయడం ద్వారా మీ అసలు అలాగే ఉంటూ.. ప్రతి నెలా వడ్డీ రూపంలో మీకు చేతి నిండా డబ్బులు అందుతాయి.

అసలు ఏంటి ఈ పోస్ట్ ఆఫీస్ MIS స్కీమ్?

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం అనేది పూర్తిగా ప్రభుత్వ మద్దతు ఉన్న ఒక పొదుపు పథకం. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. ఇందులో ఒకసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్ల పాటు ప్రతి నెలా నిర్ణీత వడ్డీ రేటుతో గ్యారెంటీ ఆదాయం లభిస్తుంది. ప్రతి నెలా స్థిరమైన ఖర్చుల కోసం చూసే సీనియర్ సిటిజన్లు, గృహిణులు, రిస్క్ అస్సలు వద్దు అనుకునే పెట్టుబడిదారుల్లో ఈ స్కీమ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది.

పెట్టుబడి పరిమితులు ఇవే

సింగిల్ అకౌంట్: ఒకే వ్యక్తి పేరు మీద గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

జాయింట్ అకౌంట్: భార్యాభర్తలు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా రూ.15 లక్షల వరకు జమ చేసుకోవచ్చు.

రూ.15 లక్షలు పెడితే.. వడ్డీనే రూ. 5.55 లక్షలు

ప్రస్తుతం ఈ పథకానికి ప్రభుత్వం 7.4శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఒకవేళ ఎవరైనా భాగస్వామితో కలిసి జాయింట్ ఖాతాలో గరిష్ట పరిమితి అయిన రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం.. అప్పుడు లెక్క ఎలా ఉంటుందో చూడండి..

  • సంవత్సరానికి వచ్చే వడ్డీ: రూ. 1,11,000
  • ప్రతి నెలా చేతికి వచ్చే ఆదాయం: సుమారు రూ.9,250
  • 5 ఏళ్లలో వచ్చే మొత్తం వడ్డీ: రూ. 5,55,000

అంటే, మీరు పెట్టిన రూ. 15 లక్షల అసలు మొత్తం ఐదేళ్ల తర్వాత మీకు అలాగే తిరిగి వచ్చేస్తుంది. కానీ, ఈ ఐదేళ్ల గ్యాప్‌లోనే మీరు కేవలం వడ్డీ రూపంలోనే ఏకంగా రూ. 5.55 లక్షలు వెనకేసుకోవచ్చు. రోజువారీ ఇంటి ఖర్చులకు, పెన్షన్ లాగా వాడుకోవడానికి ఈ రూ. 9,250 నెలవారీ ఆదాయం అద్భుతంగా హెల్ప్ అవుతుంది.

బ్యాంకు FDల కంటే ఇది ఎందుకు తోపు

చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని కేవలం మెచ్యూరిటీ సమయంలో లేదా మూడు నెలలకు ఒకసారి ఇస్తాయి. కానీ పోస్ట్ ఆఫీస్ MIS స్కీమ్‌లో వడ్డీ ప్రతి నెలా మీ అకౌంట్‌లో పడిపోతుంది. పైగా మార్కెట్ ఒడిదుడుకులతో దీనికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి పైసా రిస్క్ ఉండదు.

ఇన్వెస్ట్ చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఇది 100శాతం సేఫ్ స్కీమ్ అయినప్పటికీ దీని ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను నిబంధనలు వర్తిస్తాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మార్పులు చేస్తుంటుంది. కాబట్టి మీరు లేదా మీ ఇంట్లోని పెద్దవాళ్లు ఇందులో డబ్బులు పెట్టే ముందు ఒకసారి తాజా వడ్డీ రేట్లను, నియమాలను దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి కనుక్కోవడం మంచిది.

Follow Us