
దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PM-JDY) విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రారంభంలో ప్రతి కుటుంబానికి ఒక బ్యాంక్ ఖాతా అనే నినాదంతో మొదలైన ఈ పథకం, 2018 నాటికి ‘బ్యాంకింగ్ సేవలు అందని ప్రతి యువకుడికి ఒక ఖాతాగా రూపాంతరం చెంది, దేశంలో సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేసింది.
గణనీయంగా పెరిగిన ఖాతాలు.. రికార్డు స్థాయిలో డిపాజిట్లు
గడిచిన 12 ఏళ్లలో జన్ ధన్ పథకం సాధించిన పురోగతి దేశ ఆర్థిక ముఖచిత్రంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. 2015 నాటికి 14.72 కోట్లుగా ఉన్న జన్ ధన్ ఖాతాల సంఖ్య, ప్రస్తుతం ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 59.09 కోట్లకు చేరింది. ఈ మొత్తం లబ్ధిదారుల్లో మహిళల వాటానే 32.92 కోట్లకు చేరుకుంది. 2015లో జన్ ధన్ ఖాతాల్లో రూ. 15,670 కోట్లుగా ఉన్న మొత్తం డిపాజిట్లు, 2026 నాటికి 20 రెట్లు పెరిగి రూ. 3,16,514 కోట్లకు చేరాయి. అంతేకాదు దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ఇప్పటివరకు లబ్ధిదారులకు 41.29 కోట్ల రూపే డెబిట్ కార్డులను జారీ చేశారు.
జన్ ధన్ పథకం ప్రత్యేకతలు
జీరో బ్యాలెన్స్ సదుపాయం: ప్రైవేట్ లేదా ఇతర సాధారణ బ్యాంక్ ఖాతాల మాదిరిగా ఇందులో మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధన ఉండదు. బ్యాలెన్స్ సున్నాగా ఉన్నా ఎటువంటి జరిమానాలు లేకుండా ఖాతాను కొనసాగించవచ్చు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతగానో ఊరటనిచ్చింది.
రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా: ఈ ఖాతాతో పాటు ఉచితంగా అందించే రూపే కార్డుదారులకు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే రూ. 2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. ఇది పేద తరగతి ప్రజలకు ఆర్థికంగా ఎంతో భరోసాను ఇస్తోంది.
ఓవర్‌డ్రాఫ్ట్ (OD): ఈ ఖాతాను ఆరు నెలల పాటు నిరంతరాయంగా, సంతృప్తికరంగా నిర్వహిస్తే, కుటుంబంలో ఒకరికి రూ. 10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం పొందే అవకాశం ఉంది. ఇది కూడా ఆర్థికంగా వెనకబడిన పేద ప్రజలకు భరోసాను కల్పిస్తోంది.
ప్రత్యక్ష నగదు బదిలీ
ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు మధ్య వర్తులకు చేరకుండా, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే చేరేందుకు.. జన్ ధన్ ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తోంది. దీనితో పాటు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY), పీఎం ముద్రా రుణాలు తదితర కేంద్ర పథకాల ప్రయోజనాలను కూడా సులభంగా పొందవచ్చు.
ఖాతా ఎలా తెరవాలి?
మీరు కూడా ఖాతాను ఓపెన్ చేయాలి అనుకుంటే.. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా పాన్ కార్డు వంటి గుర్తింపు కార్డులతో కేవైసీ చేసుకొని.. సమీపంలోని ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ లేదా బ్యాంక్ మిత్ర కేంద్రాలలో ఈ ఖాతాను అత్యంత సులభంగా తెరవవచ్చు. దేశంలోని అట్టడుగు వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించి, వారిని ప్రధాన స్రవంతి ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో జన్ ధన్ యోజన ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.