
యూపీఐ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకునే సదుపాయం ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందనే దానిపై ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జూలై 1 నుండి ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని తొలుత ఈపీఎఫ్ఓ భావించింది. కానీ పీఎఫ్ సంస్థ సిస్టమ్ అప్‌గ్రేడేషన్ చేపట్టిన క్రమంలో యూపీఐ విత్ డ్రా ఫీచర్ తీసుకురావడంలో జాప్యం జరిగింది. ఇది అందుబాటులోకి వస్తే పీఎఫ్ విత్ డ్రా మరింత సులువవుతుంది. దీంతో ఈ ఫీచర్ కోసం ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఎదుచరూస్తున్నారు. ఈ క్రమంలో ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందింది. త్వరలోనే ఈ ఫీచర్ రానుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారు అయినట్లు సమాచారం.
ప్రస్తుతం బ్యాంకుల సహకారంతో యూపీఐ విత్ డ్రా ఫీచర్‌పై టెస్టింగ్ జరుగుతోంది. ఈ పనులు కూడా దాదాపు ముగియడంతో ఇక ప్రారంభమే తరువాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇందుకోసం ఒక కొత్త యాప్‌ను తీసుకురానున్నారు. ఈ యాప్ భీమ్ యాప్‌తో పాటు ఇతర యూపీఐ యాప్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది. దీంతో ఆ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతాన్ని యూపీఐ విధానం ఉపయోగించి ఖాతాదారులు విత్ డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధనల వల్ల మొత్తం విత్ డ్రా చేసుకోలేరు. మిగిలిన సొమ్మును ఎప్పుడైనా యూపీఐ ద్వారా ఉపసంహరించుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ 3.0కి మైగ్రేషన్ ఇంకా జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే యూపీఐతో పాటు ఏటీఎం ద్వారా నిధుల ఉపసంహరణ సదుపాయం అందుబాటులోకి రానుంది.ఈ మైగ్రేషన్ పూర్తయిన తర్వాత వెబ్‌సైట్ స్థిరంగా, ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా పనిచేస్తుందని నిర్ధారించుకున్న తర్వాతే ఈ కొత్త సేవలను ప్రారంభించనున్నారు. కేవలం వెబ్‌సైట్ మైగ్రేషన్ మాత్రమే కాకుండా.. ఈ సదుపాయాన్ని బ్యాంకులకు అనుసంధానించడం, యూపీఐ కోసం ప్రత్యేక అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌లో అదనపు కార్యాచరణను అభివృద్ధి చేయడం వంటి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలు ప్రస్తుతం శరవేగంగా జురుగుతున్నాయి. డిసెంబర్ నుంచి యూపీఐ, ఏటీఎం విత్ డ్రా సదుపాయాలు వచ్చే అవకాశముంది. ఇవి అందుబాటులోకి వస్తే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా మరింత సులువుకానుంది. ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నాక అకౌంట్లో జమ కావడానికి మూడు రోజుల సమయం పడుతుంది. యూపీఐ విత్ డ్రా ఫీచర్ అందుబాటులోకి వస్తే.. కేవలం గంటల్లోనే క్లెయిమ్ సెటిల్ అవుతుంది.