
రిటైర్మెంట్ తర్వాత ఈపీఎఫ్‌వో ఖాతాదారులు పెన్షన్ పొందాలంటే పెన్షన్ చెల్లింపు ఆర్డర్(PPO) తప్పనసరిగా అవసరం. ఈ 12 అంకెల కోడ్ పెన్షన్ పొందటంలో సహాయపడుతుంది. చాలామంది ఈ నెంబర్ మార్చిపోతుంటారు. కాగితం మీదనో.. లేదా డైరీలోనే రాసుకుని మర్చిపోతుంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలనే ఆందోళన ఏర్పడుతుంది. అయితే చిన్న సింపుల్ స్టెప్స్ ద్వారా పొగొట్టుకున్న పీపీఎ నెంబర్‌ను తిరిగి పొందవచ్చు. అదెలా తిరిగి పొందాలో ఒకసారి చూద్దాం.
ఈపీఎఫ్‌వో పెన్షనర్ల పోర్టల్‌కి వెళ్లండి. హోమ్ పేజీలో పీపీఓ నెంబర్ తెలుసుకోండి అని ఉండే ఆప్షన్ ఎంచుకోండి. అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయండి. ఆ తర్వాత పీపీఓ నెంబర్ మీకు క్షణాల్లోనే పొందవచ్చు. ఇక ఉమాంగ్ యాప్, డిజిలాకర్ ద్వారా కూడా మీరు ఈ నెంబర్ పొందే ఛాన్స్ ఉంది.
తొలుత మీ ఫోన్‌లో ఉమాంగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి. అనంతరం ఈపీఎఫ్‌వో సర్వీసెస్‌ను ఎంచుకోండి. అనంతరం పెన్షనర్ల సర్వీసెస్ విభాగానికి వెళ్లి అక్కడ మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించండి. వెంటనే మీకు పీపీవో నెంబర్ అందుతుంది.
ఇక డిజిలాకర్ ద్వారా కూడా మీరు పీపీవో సర్టిఫికేట్‌ను సులభతరంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం డిజిలాకర్ డౌన్ లోడ్ చేసుకోండి. అందులో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంచుకోండి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలు నమోదు చేయండి. ఆ తర్వాత సర్టిఫికేట్ ఫోన్‌లో సేవ్ అవుతుంది.
మీరు ఆఫ్‌లైన్ విధానంలో పీపీవో నెంబర్ పొందాలంటే.. ముందుగా బ్యాంక్‌కు వెళ్లండి. అనంతరం మీ సేవింగ్స్ అకౌంట్ నెంబర్‌ను సిబ్బందితో షేర్ చేసుకోండి. మీ పూర్తి సమాచారం బ్యాంక్ రికార్డుల్లో ఉంటుంది. ఆ వివరాల ఆధారంగా పీపీవో నెంబర్ చెబుతారు.
ఒకవేళ పీపీవో నెంబర్ కోల్పోతే పెన్షన్ ఆగిపోతుందేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ అలాంటిది ఏమీ జరగదు. మీ పీఎఫ్ అకౌంట్‌కు బ్యాంక్ ఖాతా లింక్ చేయబడి ఉంటుంది. దీంతో పెన్షన్ సొమ్ము ఆటోమేటిక్‌గా మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. దీంతో మీరు కోల్పోయినా నెలవారీ పింఛన్ ఎట్టిపరిస్థితుల్లో ఆగిపోదు. అయితే వార్షిక జీవిత ధృవీకరణ పత్రం సమర్పించకపోతే పెన్షన్ నిలిచిపోతుంది. ఇది సమర్పించాలంటే పీపీఓ నెంబర్ అనేది అవసరం. ఇక మీ పింఛన్ స్లిప్, బ్యాంక్ పాస్ బుక్‌లో కూడా ఈ నెంబర్ ఉంటుంది.