
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. మంగళవారం ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా విడుదలైంది. ఇందులో బైట్ డాన్స్ సహా వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్‌ను దాటి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ అవతరించారు. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీ 22వ స్థానంలో ఉన్నారు. ఆయన 88.8 బిలయన్ల డాలర్ల సంపద కలిగి ఉన్నారు. తాజాగా ఆయన సంపాద ఏకంగా 10.5 శాతం పెరిగినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.
సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఏకంగా 12 శాతం పెరిగాయి. దీంతో అంబానీ సంపద కూడా ఒకేసారి పెరగడంతో జాబితాలో ముందుకొచ్చారు. ఇటీవల రిలయన్స్ జియో ఐపీఓకు రావడం, భారీ స్థాయిలో పెట్టుబడిదారుల నుంచి ఆదరణ వచ్చిన క్రమంలో అంబానీ సంపద పెరుగుతోంది. ఇక తాజా డేటా ప్రకారం బైట్ డాన్స్ సహా వ్యవస్థాపకుడు యిమింగ్ ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల జాబితాలో 25వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద 84 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక అదానా గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 80.1 బిలియన్ డాలర్ల సంపదతో 26వ స్థానంలో ఉన్నారు.
కాగా రిలయన్స్ సమీకృత ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 28 శాతం పెరిగింది. రికార్డ్ స్థాయిలో రూ.3.62 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక EBITDA 24 శాతం పెరిగి రూ. 62,409 కోట్లకు చేరుకోగా.. నికర లాభం 34 శాతం పెరిగి రూ. 29,550 కోట్లకు చేరుకుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత నెలలో జియో ఫ్లాట్ ఫామ్స్ ఐపీఓకు రాగా.. రికార్డ్ స్థాయిలో సబ్‌స్క్రిప్షన్లు సొంతం చేసుకుంది. అక్టోబర్ 28న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ ప్రారంభించిన తొలి రోజే 27 శాతం పెరగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పుంజుకున్నాయి. జియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 66 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ఏడాదిలో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ కంపెనీల ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో రిలయన్స్ 55వ స్థానానికి చేరుకుంది. జియో ఐపీఓతో దేశంలోని అతిపెద్ద కంపెనీగా రిలయన్స్ అవతరించనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.