
జూన్ నెల ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతోంది. దీంతో దేశ ప్రజల ఆర్ధిక కార్యకలాపాలను ప్రభావితం చేసే అనేక కొత్త మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఈ కొత్త నెల మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అనేక మార్పులను తీసుకువస్తోంది. ప్రధానంగా యూపీఐ, ఏటీఎం నిబంధనల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. వీటి గురించి ముందే తెలుసుకోవడం వల్ల ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే సమయంలో జాగ్రత్త పడవచ్చు. ఇంతకు యూపీఐ, ఏటీఎం లావాదేవీల్లో జరగనున్న మార్పులు ఏంటి అనేది చూద్దాం.
జూన్ 1వ తేదీ నుండి యూపీఐ లావాదేవీల్లో పెద్ద మార్పు జరగనుంది. అదేంటంటే.. ఇక నుంచి మీరు యూపీఐ ద్వారా ఎవరికి అయినా డబ్బులు బదిలీ చేస్తే.. వారి అసలు బ్యాంకులో నమోదైన పేరు మీకు కనిపిస్తుంది. యూపీఐ మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీరు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా డబ్బులు పంపితే బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్లుగానే పేరు కనిపిస్తుంది. దీని వల్ల మీరు సరైన వ్యక్తికి డబ్బులు పంపుతున్నారా.. లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది.
జూన్ 1వ తేదీ నుండి చాలా బ్యాంకులు తమ ఏటీఎం లావాదేవీల విధానాలలో మార్పులు చేస్తున్నారు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో జరిపేప ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గించనున్నాయి. ఏటీఎంలలో నగదు విత్ డ్రా, బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్‌మెంట్ చూడటం వంటి సేవలు మరింత ఖరీదు కానున్నాయి. ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా చేసేవారికి ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. మీరు ఇతర బ్యాంక్ ఏటీఎంల ద్వారా లావాదేవీలు చేయాలంటే జూన్ 1వ తేదీ నుంచి జరిగే మార్పులను గమనించడం మంచిది.