Finance Tips: లోన్ చెల్లించాక ఈ డాక్యుమెంట్స్ తీసుకోవడం మర్చిపోయారా..? ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త

చాలామంది తమ అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే రుణం మొత్తం తిరిగి చెల్లించిన తర్వాత తమ పని అయిపోందని అనుకుంటారు. కానీ కొన్ని పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలి. దీని వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Finance Tips: లోన్ చెల్లించాక ఈ డాక్యుమెంట్స్ తీసుకోవడం మర్చిపోయారా..? ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త
Bank Home Loan

Updated on: Jul 16, 2026 | 6:59 AM

ఆర్ధిక అవసరాల దృష్ట్యా చాలామంది బ్యాంకులు, ఎన్‌ఎఫ్‌బీసీలు లేదా ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. తమ అర్ధిక అవసరాలను తీర్చడంలో రుణాలు సహాయపడతాయి. అత్యవసరంగా డబ్బులు అవసరమై సమయంలో తమ ఆస్తులను తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటూ ఉంటారు. నెలవారీ ఈఎంఐ లేదా ఒకేసారి వడ్డీతో సహా చెల్లించి లోన్ అకౌంట్ క్లోజ్ చేశారు. అయితే రుణం తిరిగి చెల్లించినంత మాత్రాన ప్రక్రియ పూర్తిగా ముగిసినట్లు కాదు. భవిష్యత్తులో సమస్యలను రాకుండా ఉండాలనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. లోన్ అకౌంట్ మూసివేసిన తర్వాత బ్యాంకు నుండి ముఖ్యమైన కొన్ని పత్రాలను తీసుకోవాలి. వీటిని మనం అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది తమ రుణం తీరిపోయిన తర్వాత అవసరమైన పత్రాలను తిరిగి తీసుకోవడం మర్చిపోతారు. దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడవచ్చు.

ఎన్ఓసీ తప్పనిసరి

రుణం తీసుకునేటప్పుడు ఏదైనా ఆస్తి పత్రాలు, అమ్మకపు దస్తావేజులు, ఒప్పందాలు లేదా ఇతర అసలు పత్రాలను పూచీకత్తుగా సమర్పించి ఉంటారు. రుణం తిరిగి చెల్లించిన తర్వాత వాటన్నింటినీ బ్యాంకు నుండి తిరిగి తీసుకోవాలి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఇది ఒకటిగా చెప్పవచ్చు. రుణం తిరిగి చెల్లించబడిందని, ఎటువంటి బకాయి చెల్లింపులు పెండింగ్‌లో లేవని ఇది ధృవీకరిస్తుంది. ఇక బ్యాంకులు తరచుగా రుణ ప్రక్రియ సమయంలో సంతకం చేసిన ఖాళీ చెక్కులను సేకరిస్తాయి. రుణం మంజూరైన తర్వాత ఎలాంటి దుర్వినియోగం జరగకుండా నివారించేందుకు రుణగ్రహీతలు ఈ చెక్కులను తిరిగి ఇచ్చేలా చూసుకోవాలి.

సిబిల్ రిపోర్ట్ చెక్ చేస్కోండి

మీ రుణం స్టేటస్ క్రెడిట్ రిపోర్టులో క్లోజ్ చేసినట్లు ఉందా.. లేదా అనేది చెక్ చేసుకోవాలి. స్టేటస్ తప్పుగా ఉండటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. లోన్ అకౌంట్ పూర్తిగా మూసివేసినట్లు ధృవీకరించే అధికారిక పత్రాన్ని కూడా తీసుకోవాలి. ఈ పత్రం తిరిగి చెల్లింపునకు అదనపు రుజువుగా ఉపయోగపడుతుంది. రుణ ముగింపు పత్రాలను సేకరించపోతే ముఖ్యంగా ఆస్తి లావాదేవీల సమయంలో లేదా మరో రుణం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇబ్బందులు తలెత్తవచ్చు. అన్ని రికార్డులను సురక్షితంగా ఉంచుకోవడం, రుణగ్రహీతలు తమ ఆర్థిక బాధ్యతలను పూర్తి చేశారని నిరూపించుకోవడానికి సహాయపడుతుంది. మీరు ఏదైనా లోన్ తీసుకుని తిరిగి చెల్లిస్తే తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేకపోతే మీకు భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది.

Follow Us