Jewellery: తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత ఖర్చవుతుంది? తరుగు, మజూరీ, GST కలిపి లెక్కలివే!

Gold Jewellery: నవంబర్ 1, 2026 హైదరాబాద్ బంగారం ధరల ప్రకారం తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత ఖర్చవుతుంది? తరుగు, మజూరీ, హాల్‌మార్కింగ్, GST లెక్కలు తెలుసుకోండి. అయితే బంగారం కొనుగోలు చేయాలన్నా, నగలు చేయించుకోవాలన్నా చాలామంది ముందుగా చూసేది..

Jewellery: తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత ఖర్చవుతుంది? తరుగు, మజూరీ, GST కలిపి లెక్కలివే!
Gold Jewellery

Updated on: Nov 02, 2026 | 3:41 PM

Gold Jewellery: బంగారం కొనుగోలు చేయాలన్నా, నగలు చేయించుకోవాలన్నా చాలామంది ముందుగా చూసేది ఆరోజు మార్కెట్‌లో ఉన్న బంగారం ధర. అయితే ఆ ధరకు అదనంగా మరికొన్ని ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తరుగు (వేస్టేజ్), మజూరీ (మేకింగ్ ఛార్జీలు), హాల్‌మార్కింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటివి బిల్లులో చేరతాయి. దీంతో తులం బంగారంతో నగలు చేయించుకోవడానికి ఎంత ఖర్చవుతుందనే సందేహం చాలామందికి ఉంటుంది. మరి 2026 నవంబర్ 1 నాటి హైదరాబాద్ బంగారం ధరల ప్రకారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంతో నగలు చేయిస్తే ఎంత బిల్లు వస్తుంది? లెక్కలతో తెలుసుకుందాం.

నవంబర్ 1న హైదరాబాద్‌లో బంగారం ధరలు

2026 నవంబర్ 1న హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర సుమారు రూ.12,730గా నమోదైంది. అయితే వేర్వేరు ధరల వెబ్‌సైట్లలో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. అందువల్ల నగలు చేయించే ముందు స్థానిక జ్యువెలరీ షాపులో ఆరోజు ధరను నిర్ధారించుకోవాలి. నగల తయారీకి సాధారణంగా 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. అందుకే ఇప్పుడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారాన్ని ప్రామాణికంగా తీసుకుని లెక్క చూద్దాం.

1. తులం బంగారానికి ఎంత తరుగు పోతుంది?

బంగారు నగలు తయారు చేసే సమయంలో డిజైన్, తయారీ విధానం, పాలిషింగ్ తదితర ప్రక్రియలను బట్టి కొంత బంగారం నష్టం జరిగినట్లు పరిగణిస్తారు. దీన్నే తరుగు లేదా వేస్టేజ్ అంటారు. సాధారణంగా నగల డిజైన్‌ను బట్టి 3 శాతం నుంచి 10 శాతం లేదా అంతకంటే ఎక్కువగా కూడా తరుగు ఛార్జీ విధించవచ్చు. ఇది ప్రతి షాపులో ఒకేలా ఉండదు.

  • 3% అంటే 0.30 గ్రాములకు రూ. 3,819
  • 5% – 0.50 గ్రాములకు రూ. 6,365
  • 8% – 0.80 గ్రాములకు రూ.10,184
  • 10% – 1 గ్రాముకు రూ.12,730

ఉదాహరణకు 5 శాతం తరుగు విధిస్తే, 10 గ్రాముల బంగారం విలువపై అదనంగా రూ.6,365 చెల్లించాల్సి వస్తుంది. అయితే ప్రతి నగకూ ఇదే తరుగు ఉండదు. సింపుల్ చైన్, ఉంగరం వంటి వాటికి తక్కువగా ఉండొచ్చు. క్లిష్టమైన డిజైన్లు, చేతితో తయారుచేసే నగలకు ఎక్కువగా ఉండొచ్చు.

2. మజూరీ (Making Charges) ఎంత ఉంటుంది?

బంగారాన్ని నగగా మార్చడానికి స్వర్ణకారులు చేసే పనికి వసూలు చేసే మొత్తాన్ని మజూరీ అంటారు. నగ డిజైన్, తయారీ సమయం, పనితనం, యంత్రాలతో తయారు చేశారా లేదా చేతితో చేశారా అనే అంశాలను బట్టి ఈ ఛార్జీలు మారుతాయి. ఉదాహరణకు గ్రాముకు రూ.300 నుంచి రూ.800 వరకు మజూరీ తీసుకుంటున్నారని అనుకుంటే 10 గ్రాములకు ఇలా ఉంటుంది.

గ్రాముకు మజూరీ – 10 గ్రాములకు ఛార్జీ

  • రూ. 300 – రూ.3,000
  • రూ. 400 – రూ. 4,000
  • రూ. 500 రూ.5,000
  • రూ. 600 – రూ.6,000
  • రూ. 800 – రూ.8,000

సాధారణ డిజైన్లకు తక్కువ మజూరీ ఉండవచ్చు. పెళ్లి నగలు, యాంటిక్ డిజైన్లు, క్లిష్టమైన పనితనం ఉన్న ఆభరణాలకు ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉంటుంది. కొన్ని షాపులు గ్రాముకు కాకుండా బంగారం విలువలో శాతంగా కూడా మజూరీ లెక్కిస్తాయి.

3. రిఫైనింగ్ ఛార్జీలు కూడా ఉంటాయా?

చాలామందికి తరుగు, మజూరీతో పాటు రిఫైనింగ్ ఛార్జీలు కూడా ఉంటాయా అనే సందేహం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కొత్తగా బంగారం కొనుగోలు చేసి నగలు చేయించుకుంటే ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకంగా రిఫైనింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే పాత బంగారాన్ని కరిగించి కొత్త నగలు చేయించుకున్నప్పుడు కొన్ని షాపులు ఈ కింది ఛార్జీలు విధించవచ్చు.

  • పాత బంగారాన్ని కరిగించే ఛార్జీలు
  • బంగారం స్వచ్ఛతను పరీక్షించే ఛార్జీలు
  • రిఫైనింగ్ ప్రక్రియలో వచ్చే లోహ నష్టానికి సంబంధించిన తగ్గింపులు.
  • ఇతర ప్రాసెసింగ్ ఛార్జీలు.

ఇవి షాపును బట్టి మారుతాయి. దీనికి దేశవ్యాప్తంగా ఒకే స్థిరమైన రేటు లేదు. కాబట్టి పాత బంగారం ఇచ్చేటప్పుడు దాని నికర బరువు, స్వచ్ఛత, రిఫైనింగ్ నష్టం, వర్తించే ఛార్జీల వివరాలను ముందుగానే అడగాలి.

4. హాల్‌మార్కింగ్ ఛార్జీలు ఎంత?

బంగారు నగల స్వచ్ఛతను నిర్ధారించడానికి BIS హాల్‌మార్కింగ్ ఉపయోగపడుతుంది. హాల్‌మార్క్ ఉన్న నగలపై BIS గుర్తు, క్యారెట్ స్వచ్ఛత వివరాలు, ఆరు అంకెల HUID నంబర్ ఉంటాయి. 2026 అక్టోబర్‌లో సవరించిన రేట్ల ప్రకారం బంగారు ఆభరణానికి హాల్‌మార్కింగ్ ఛార్జీ రూ.75గా ఉంది. ఒక కన్సైన్‌మెంట్‌కు కనీస ఛార్జీ రూ.200. ఈ ఛార్జీ బంగారం బరువును బట్టి కాకుండా ఆభరణాల సంఖ్యను బట్టి ఉంటుంది.

5. GST ఎంత చెల్లించాలి?

బంగారు నగలు కొనుగోలు చేసినప్పుడు మొత్తం లావాదేవీ విలువపై 3 శాతం GST చెల్లించాలి. ఇందులో బంగారం విలువ, మజూరీ వంటి ఛార్జీలు కలిపి లెక్కిస్తారు. ఉదాహరణకు బంగారం విలువ, తరుగు, మజూరీ కలిపి రూ.1,38,665 అయితే దానిపై 3 శాతం GST రూ.4,160 అవుతుంది (సుమారుగా).

6. తులం బంగారంతో నగలు చేయిస్తే మొత్తం ఎంత బిల్లు వస్తుంది?

ఇప్పుడు అసలు లెక్క చూద్దాం. 2026 నవంబర్ 1న హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,27,300గా తీసుకుందాం. 5 శాతం తరుగు, గ్రాముకు రూ.500 మజూరీ, ఒక నగకు రూ.75 హాల్‌మార్కింగ్ ఛార్జీ అని ఉదాహరణకు అనుకుందాం.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారు నగల అంచనా బిల్లు

హైదరాబాద్ ధరలు – నవంబర్ 1, 2026

  • బంగారం విలువ (10 గ్రాములు) రూ.1,27,300
  • తరుగు (5% విలువ) రూ.6,365
  • మజూరీ (రూ.500 × 10 గ్రాములు) రూ.5,000
  • హాల్‌మార్కింగ్ (ఒక నగ) – రూ.75
  • మొత్తం టోటల్‌ – రూ.1,38,740
  • GST (3%) రూ.4,162
  • మొత్తం అంచనా ఖర్చు
  • రూ.1,42,902

(నోట్‌- ఇక్కడ అందించిన లెక్కలు కేవలం అంచనాలు మాత్రమే. ప్రాంతాలను బట్టి ధరలు, ఛార్జీలలో తేడా ఉండవచ్చు. అలాగే ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా బంగారం ధరలు ఉంటాయి. ఆయా ప్రాంతం జీఎస్టీ, ఇతర ఛార్జీలతో మారుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ అందించిన ధరలు ఇవేనని భావించవద్దని సూచిస్తున్నాము.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us