ఆ ఫీచర్‌ను వెంటనే ఆపేయండి.. ర్యాపిడో, ఓలా , ఊబర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!

ఓలా, ఊబర్, ర్యాపిడోలకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రైడ్ బుక్ చేసుకోవడానికి ముందే డ్రైవర్‌కు టిప్ యాడ్ చేసే ఆప్షన్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఇలాంటి ధోరణి వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని, ఇది వ్యాపార విలువలకు విరుద్ధమని పేర్కొంది.

ఆ ఫీచర్‌ను వెంటనే ఆపేయండి.. ర్యాపిడో, ఓలా , ఊబర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!
Ccpa Cracks Down On Ride Hailing Apps

Updated on: Sep 17, 2026 | 10:34 AM

క్యాబ్ సేవలు అందించే ఓలా, ఊబర్, ర్యాపిడో ప్లాట్‌ఫామ్‌లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. బుకింగ్‌కు ముందే వినియోగదారుల నుంచి టిప్ తీసుకునే అడ్వాన్స్ ఫీచర్ విధానాన్ని వెంటనే ఆపేయాలని హెచ్చరించింది. ఈ మేరకు క్యాబ్, బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇలా యాప్ ఓపెన్ చేయకముందు ఒక రేటు, తర్వాత మరో రేటు చూపించడం వినియోగదారులను తప్పుదోవ పట్టించడమే అవుతుందని, ఇది నైతిక వ్యాపార సూత్రాలకు విరుద్ధమని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే బుధవారం స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బుక్ చేసుకునేప్పుడు ఒక ఛార్జీ చూపిస్తూ, టిప్ యాడ్ చేయాలని మరో ఛార్జీ చూపిస్తున్నారని, దీనివల్ల ప్రయాణికులు టిప్ యాడ్ చేస్తే తప్ప డ్రైవర్లు రైడ్స్‌ను యాక్సెప్ట్ చేయట్లేదని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. టిప్ యాడ్ చేయకపోతే అసలు రైడ్ దొరకదని, టిప్ ఇస్తేనే రైడ్స్ బుక్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని వినియోగదారులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారని చెప్పారు. ఇలా వినియోగదారులను బలవంతంగా డబ్బులు చెల్లించేలా ఒత్తిడికి గురిచేయడం నిబంధనలకు విరుద్ధమని, దీన్ని పూర్తిగా ఆపేయాలని తెలిపారు. టిప్ ఇవ్వాలా వద్దా అనేది వినియోగదారుల ఇష్టమని, సర్వీస్ నచ్చితే వాళ్లే ఇష్టపూర్వకంగా ఇస్తారని స్పష్టం చేశారు.

ర్యాపిడోకు రూ.10 లక్షల ఫైన్..

నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల నుంచి అడ్వాన్స్ టిప్పింగ్ వసూలు చేస్తోందనే ఆరోపణలతో ప్రముఖ బైక్, టాక్సీ సేవలు అందిస్తున్న రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీసీపీఏ (CCPA) రూ.10 లక్షల జరిమానా విధించింది. రైడ్ బుక్ చేసుకునే సమయంలో ‘యాడ్ టిప్’ పేరుతో మరిన్ని డబ్బులు యాడ్ చేస్తే రైడ్ త్వరగా బుక్ అవుతుందని, మీరు బుక్ చేసిన రూ.100 రైడ్‌ను డ్రైవర్లు తీసుకోవట్లేదని, దానికి మరో రూ.10, 20, 30 యాడ్ చేస్తే మీ రైడ్ వెంటనే బుక్ అవుతుందనేలా చూపించడాన్ని సీసీపీఏ తీవ్రంగా తప్పుపట్టింది. ఇలా చేయడం ‘డార్క్ ప్యాటర్న్’ల కిందకు వస్తుందని తెలిపింది.

అలాగే ఊబర్, ఓలాల్లోని అడ్వాన్స్ టిప్పింగ్, డైనమిక్ ప్రైసింగ్ విధానాలపై కూడా విచారణ జరుగుతోందని సీసీపీఏ తెలిపింది. ఇకపై అన్ని ప్లాట్‌ఫామ్‌లు 2023 డార్క్ ప్యాటర్న్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us