
Success Story: తమిళనాడులోని ఒక చిన్న గ్రామం వీరమంగళం. ఈ గ్రామం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో సుబ్రహ్మణ్యన్ అనే యువకుడికి ఒక వినూత్న ఆలోచన వచ్చింది. తన తాత పెరియ తంబి చేసే సంప్రదాయ, ప్రామాణిక వంటలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనతో 2018లో విలేజ్ కుకింగ్ ఛానెల్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. అయితే, వారి ప్రయాణం ప్రారంభంలో అంత సులభంగా సాగలేదు.
ఛానెల్ ప్రారంభించిన వెంటనే వారికి విజయం దక్కలేదు. నెలల తరబడి వీడియోలు చేసినా పెద్దగా స్పందన రాలేదు. వంటల కోసం అవసరమైన పదార్థాలు కొనుగోలు చేయడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. గ్రామంలోని కొందరు వారిని ఎగతాళి చేశారు. “ఇది మన వల్ల కాదు” అని ఎన్నోసార్లు భావించినప్పటికీ, వారు తమ ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. వారి పట్టుదల, కష్టమే వారిని ముందుకు నడిపింది.
అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న తర్వాత, ఒక రోజు వారు చేసిన ఒక వీడియో అకస్మాత్తుగా వైరల్ అయింది. ఆ ఒక్క వీడియోతో వారి జీవితం పూర్తిగా మారిపోయింది. వారి వద్ద ఫ్యాన్సీ కిచెన్లు లేవు.. ఖరీదైన కెమెరాలు లేవు. కానీ, వారి వంటల్లో స్వచ్ఛత, నిజాయితీ స్పష్టంగా కనిపించాయి. గ్రామీణ వాతావరణంలో, కట్టెల పొయ్యిపై సంప్రదాయ పద్ధతిలో చేసే వారి వంటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని ఆకర్షించాయి. వారు తమ వీడియోల చివర్లో చెప్పే “ఆల్వేస్ వెల్‌కమ్స్ యూ” అనే మాట కోట్లాది మంది మనసులను గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వేలో 43 ఏళ్ల నాటి ఆర్ఏసీ నిబంధన రద్దు కానుంది! ఇకపై పూర్తి ఛార్జీ చెల్లించినా సీటు లభించదా?
ఈ ఛానెల్ కేవలం వంటలకు మాత్రమే పరిమితం కాలేదు. విలేజ్ కుకింగ్ ఛానెల్ దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా ఒక కోటి సబ్‌స్క్రైబర్‌లను దాటిన ఛానెల్‌గా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం వీరికి 3 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే, వారి గొప్పతనం కేవలం విజయంతో ఆగిపోలేదు. ఒకప్పుడు ఆకలితో బాధపడిన వారు కావడంతో ఆకలి విలువ వారికి బాగా తెలుసు. అందుకే, వారు వండిన ఆహారాన్ని కేవలం వీడియోల కోసం మాత్రమే కాకుండా, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, పేద ప్రజలకు నిస్వార్థంగా అందిస్తూ ఉంటారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా, వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
Village Cooking Channel
ఒకప్పుడు తమ గ్రామం దాటి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడిన ఈ సాధారణ రైతులు, ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్ వరకు వెళ్లి వంటలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వారి సాధనకు మరో ముఖ్యమైన ఉదాహరణ ఏమిటంటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా వారి గ్రామానికి వెళ్లి, వారితో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు. ఇది వారి ప్రజాదరణ, గౌరవానికి నిదర్శనం. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని బోధిస్తుంది. డబ్బులు లేకపోయినా, గొప్ప బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా పర్వాలేదు. కానీ, కష్టపడే తత్వం, మంచి మనసు ఉంటే ఒక సాధారణ రైతు కూడా ప్రపంచ స్థాయికి ఎదగగలడు. విలేజ్ కుకింగ్ ఛానెల్ విజయం ఈ సూత్రాన్ని స్పష్టంగా నిరూపించింది. ఈ ఆరుగురు పల్లెటూరి రైతుల నిజమైన విజయ ప్రయాణం ఎందరికో ఆదర్శప్రాయం.
ఇది కూడా చదవండి: Gold Loan: కొత్త చిక్కులు తెస్తున్న గోల్డ్ లోన్.. అదేంటో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి