
FASTag: జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలు నవంబర్ 1 నుంచి రాయితీతో కూడిన వార్షిక లోకల్ ఫాస్టాగ్ పాస్‌ను పొందవచ్చని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, మున్సిపల్ లేదా స్థానిక పట్టణ పరిమితుల వెలుపల ఉన్న టోల్ ప్లాజాలకు ఈ పాస్ వార్షిక రుసుము రూ.1,500 కాగా, కమర్షియల్ వాహనాలకు ఇది వర్తించదు. ప్రస్తుతం వ్యక్తిగత వాహనదారులకు వార్షిక పాస్ రూ.3 వేలకు లభ్యమవుతోంది. దీని సాయంతో ఏడాది లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుంది.
కొత్త నిబంధన ప్రకారం, 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న అర్హులైన వాణిజ్యేతర వాహన యజమానులు, వారి వద్ద చెల్లుబాటులో ఉన్న , యాక్టివ్‌గా ఉన్న ఫాస్టాగ్ (FASTag) ఉన్నట్లయితే ఒక నిర్దిష్ట టోల్ ప్లాజా గుండా ప్రయాణించడానికి ప్రస్తుతం ఉన్న నెలవారీ పాస్ లేదా రాయితీతో కూడిన స్థానిక పాస్‌ను ఎంచుకోవచ్చు. ఈ పాస్, టోల్ చెల్లించిన టోల్ ప్లాజాకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దీనిని మరే ఇతర టోల్ ప్లాజాకు ఉపయోగించలేరు.
‘క్లోజ్డ్ యూజర్ ఫీజు వసూలు విధానం’ ఆధారంగా రుసుము వసూలు చేసే ఏ జాతీయ రహదారి లేదా ఎక్స్‌ప్రెస్‌వేపై అయినా స్థానికులకు ఎలాంటి రాయితీ పాస్‌లు జారీ చేయరని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా, ప్రయాణికులకు సర్వీస్ రోడ్డు లేదా ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులో ఉన్నచోట కూడా అటువంటి పాస్‌లు జారీ చేయరు. దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లు జారీ అయినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తెలిపింది.
ఈ కొత్త నిబంధన, టోల్ ప్లాజాల సమీపంలో నివసించే అర్హులైన నివాసితులకు ఒక ప్రత్యామ్నాయాన్ని అందించడం, వారి ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా చేయడం, స్థానికుల రాకపోకలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ‘జాతీయ రహదారుల చట్టం, 1956’ కింద సంక్రమించిన అధికారాలను ఉపయోగించి, ‘జాతీయ రహదారుల రుసుము నియమావళి, 2026’ ద్వారా ఈ సవరణను నోటిఫై చేయడం జరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి