
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. పీఎఫ్‌కు సంబంధించిన సమాచారం మొత్తాన్ని వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో అధికారిక వాట్సప్ ఛానెల్‌ను తీసుకొచ్చింది. ఇటీవల డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్న భవిష్య నిధి సంస్థ.. ఇప్పుడు కీలక సమాచారాన్ని సులభంగా ఉద్యోగులకు అందించేందుకు ఈ కొత్త సేవ ప్రారంభించింది. ప్రస్తుతం ప్రతీఒక్కరూ వాట్సప్ అనేది వాడుతున్నారు. దీంతో వాట్సప్ ద్వారా త్వరగా సమాచారం అందించవచ్చు. ఈ కారణంతో కొత్తగా వాట్సప్ ఛానెల్ ప్రవేశపెట్టింది. ఈ వాట్సప్ ఛానెల్ ద్వారా పీఎఫ్ ఖాతాదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పీఎఫ్‌కు సంబంధించిన ప్రకటనలు, నూతన పథకాలు, నోటిఫికేషన్లు, కీలక అప్డేట్స్, సవరణల అప్డేట్లను నేరుగా తమ మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో వాట్సప్ చాట్ బాట్ సేవలను కూడా ప్రారంభించాలని ఈపీఎఫ్ఓ చూస్తోంది. దీని వల్ల వాట్సప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం, క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోవడం లాంటి సేవలు పొందవచ్చు.
EPFO ఈ వాట్సప్ ఛానెల్లో చేరడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ లింక్ ద్వారా సింపుల్‌గా చేరవచ్చు. ఈపీఎఫ్ఓ విడుదల చేసిన వాట్సప్ లింక్ ఓపెన్ చేసి “ఫాలో” ఆప్షన్ ఎంచుకుకంటే సరిపోతుంది. ఇక క్యూఆర్ కోడ్ ద్వారా వాట్సప్ ఛానెల్లో చేరవచ్చు. ఈపీఎఫ్ఓ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ విడుదల చేసింది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా నేరుగా వాట్సప్ ఛానెల్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఫాలో క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక మూడో ఆప్షన్ వాట్సప్ సెర్చ్. వాట్సప్‌లోని “అప్డేట్స్” విభాగంలోకి వెళ్లి “EPFO” అని టైప్ చేయండి. బ్లూ టిక్ ఉన్న ఈపీఎఫ్ఓ వెరిఫైడ్ ఖాతాను ఫాలో అవ్వడం ద్వారా వాట్సప్ ఛానెల్లో చేరవచ్చు.ఈ వాట్సప్ ఛానెల్ ద్వారా సమాచారం వేగంగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓకు సంబంధించిన ప్రతీ సమాచారం ఇక్కడ పొందవచ్చు. ప్రతి చిన్న సమాచారం కోసం పదేపదే ప్రాంతీయ పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. అలాగే ఈపీఎఫ్ఓ వెబ్ సైట్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదు.
అలాగే సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలకు బదులు అధికారిక సమాచారాన్ని నేరుగా సంస్థ నుంచి పొందవచ్చు. పీఎఫ్ సేవల్లో పారదర్శకతను పెంచడంతో పాటు ఉద్యోగులతో నేరుగా అనుసంధానం కావడం కోసం ఈ సేవను EPFO తీసుకొచ్చింది. అయితే ఈ వాట్సప్ ఛానెల్ కేవలం సమాచారం, అప్డేట్లు తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ ఛానెల్ ద్వారా పీఎఫ్ ఖాతాలోని డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం లేదా పూర్తిస్థాయి లాగిన్ అయి ఖాతా వివరాలను సవరించుకోవడం వంటి పనులు నిర్వహించుకోలేరు.