
పీఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ వార్షిక వడ్డీని జమ చేయడం ప్రారంభించింది. జులై 3వ తేదీ నుంచి వడ్డీని ఖాతాదారుల అకౌంట్లోకి విడుదల చేస్తోంది. ప్రస్తుతం కొందరి అకౌంట్లలో ఇప్పటికే డబ్బులు పడగా.. 15 రోజుల్లో ఖాతాదారుల అందరి అకౌంట్లో పడనున్నాయి. దీంతో చాలామంది పీఎఫ్ వడ్డీని చెక్ చేసుకుంటున్నారు. పీఎఫ్ వడ్డీ ఎప్పుడెప్పుడు జమ అవుతుందా అని ఖాతాదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. మార్చిలో ఈపీఎఫ్ఓ వార్షిక వడ్డీ 8.25 శాతం అందించాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఆమోదం కోసం కేంద్ర ఆర్ధికశాఖకు పంపింది. కేంద్ర ఆర్ధికశాఖ ఇటీవల ఆమోదం తెలపడంతో ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది.
ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో పాస్ బుక్ యాక్సెస్ నిలిచిపోయాయి. వారం రోజులుగా పాస్ బుక్ సేవలు నిలిచిపోగా.. అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. దీంతో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే ఉన్నాయి. మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. యూఏఎన్‌తో లింక్ అయిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. రెండు రింగుల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. కొన్ని సెకన్లలోనే మీ మొబైల్‌కు టెక్ట్స్ రూపంలో బ్యాలెన్స్ వివరాలు అందుతాయి. ఇక ఎస్‌ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి EPFOHO UAN LAN ఫార్మట్‌లో మెస్సేజ్ పంపాలి. దీంతో టెక్ట్స్ రూపంలో మీ బ్యాలెన్స్ వివరాలు అందుతాయి.
ప్రధాన సిస్టమ్ అప్‌గ్రేడ్ కారణంగా దాదాపు 7 రోజుల పాటు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ మూతపడింది. జూన్ 26వ తేదీ నుంచి నిలిచిపోగా.. జూలై 3న శుక్రవారం తెరుచుకుంది. అయితే సభ్యుల లాగిన్ పేజీ సరిగ్గా పనిచేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ UAN పోర్టల్‌లోకి లాగిన్ అవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం కొన్ని సర్వీసులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దశలవారీగా మిగతా సేవలు అందుబాటులోకి వస్తాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. మరో రెండు వారాల సమయం పట్టే అవకాశముంది. పాస్ బుక్ సేవలు ఇంకా ఓపెన్ కాకపోవడంతో ఖాతాదారులు వడ్డీ జమ అయిందా.. లేదా అనేది తెలుసుకోలేకపోతున్నారు. అయితే మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ విధానం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. లేదా యూఏఎన్ పోర్టల్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.