
బంగారం పట్ల భారతీయులకు ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండుగలు, పెళ్లిళ్లు, ఏదైనా ఫంక్షన్ వస్తే చాలు ముందుగా చర్చించుకునేది బంగారం గురించే. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో గోల్డ్ కొనడం భారతీయుల ప్రతి ఇంట్లో ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే దేశ ప్రజలు బంగారాన్ని ఒక ఆభరణంగానే కాదు.. ఒక ఆస్తిగా కూడా పరిగణిస్తారు. ఏదైనా ఆపద వచ్చి అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు ఆదుకోగల పెట్టుబడిగా బంగారాన్ని పరిగణిస్తారు. దీంతో బంగారాన్ని లాకర్లలో లేదా అల్మారాలలో భద్రంగా దాచుకుంటారు.
అయితే బంగారాన్ని దాచుకోవడం కంటే దానిని పెట్టుబడిగా పెట్టడం వల్ల ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. ఆభరణాలను కేవలం పండుగలు, ఫంక్షన్ల సమయంలో మాత్రమే ధరిస్తారు. మిగతా సమయాల్లో ఇంట్లోనే దాచిపెట్టుకుంటారు. బంగారం ధర పెరిగినా మీరు ఇంట్లో ఉంచుకుంటే నష్టపోతారు. అదే మీరు గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లలో లాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వస్తుంది. అలాగే మీరు మీ బంగారాన్ని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకు లేదా NBFC సంస్థ వద్ద తాకట్టు పెట్టి రుణం పొందండి. మీరు తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించిన తర్వాత మీ బంగారం మీకు అందిస్తారు. క్రెడిట్ కార్డులు లేదా పర్సనల్ లోన్లతో పోలిస్తే బంగారం రుణాలపై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఎలాంటి పూచీకత్తు, హామీ కూడా అవసరం లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో గోల్డ్ లోన్ అనేది మంచి ఆప్షన్.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బంగారం నగదీకరణ పథకం’ ద్వారా కూడా మీ ఇంట్లోని బంగారం నుంచి ఆదాయం పొందవచ్చు. ఈ పథకం కింద ఎవరైనా తమ వద్ద ఉపయోగించని బంగారాన్ని ఒక నిర్దిష్ట కాలం పాటు బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చు. బ్యాంకులు ఇందుకు మీకు వడ్డీని చెల్లిస్తాయి. మీరు డిపాజిట్ చేసిన బంగారు ఆభరణాలను కరిగించి సాధారణ బిస్కెట్లు లేదా కడ్డీలుగా మార్చుతారు. కేవలం పెట్టుబడి కోసం బంగారు నాణేలు లేదా కడ్డీలను కొనుగోలు చేసిన వారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ‘గోల్డ్ ఈటీఎఫ్‌లు’, డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బ్యాంకు లాకర్లతో బంగారం దాచిపెట్టుకుంటే లాకర్ల ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. అదే అదే బంగారాన్ని పెట్టుబడి పెడితే మీకు ఆదాయం వస్తుంది. అలాగే మీ బంగారం కూడా మీ దగ్గర ఉంటుంది.