సరికొత్త ఆవిష్కరణలకు పెట్టింది పేరు జపాన్. ఈ దేశం ఇటీవలే ఓ సరికొత్త రైలును పట్టాలెక్కించింది. దాదాపు 360 కిలో మీటర్ల గరిష్ఠ వేగంతో నడిచే ఈ రైలు భూకంపాలను పడిగడుతుంది. అత్యంత అధునాతనంగా తయారైన ఈ బుల్లెట్ రైలు ఈ మధ్యే పట్టాలెక్కింది. టొకైడో మార్గంలో తాజాగా దూసుకెళ్లిన ఈ రైలులో చాలా ప్రత్యేకతలున్నాయి.
ఈ రైలు మోడల్ పేరు ఎన్700ఎస్. ఇక ఈ రైలు గరిష్ట వేగం గంటకు 360 కిలీమీటర్లు. వాస్తవ వేగం గంటకు 285 కిలో మీటర్లు. ఇక ఈ ట్రైన్‌లో సీట్లు కూర్చోడానికి సౌకర్యంగా వాలుగా ఉంటాయి. ప్రతీ సీటుకూ మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి ఈ ఏడాది జపాన్‌లో ఒలింపిక్స్ నిర్వహించాల్సి ఉంది. అదే సమయంలో ఈ రైలును పరుగులు పెట్టించాలనుకుంది జపాన్. అనుకున్న సమయానికి రైలు సిద్ధం చేసింది.
ఇక ఈ రైలులో అంత్యంత ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే భద్రత. షింకన్‌సేన్ నెట్‌వర్క్ మొత్తాన్ని ఇప్పటికే భూకంపాన్ని గుర్తించే సెన్సార్లకు అనుసంధానించారు. ఈ టెక్నాలజీతో ఎక్కడైన భూకంపం వస్తే ఆ మార్గంలోని రైళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అత్యవసర బ్రేకులు వాటంతటవే పడి రైళ్లు ఆగిపోతాయి.
ఎన్700ఎస్‌లో మరో ప్రత్యేకమైన భద్రతను కూడా జోడించారు. లిథియం-అయాన్ బ్యాటరీతో కూడిన స్వీయ-ప్రోపల్షన్ వ్యవస్థను ఈ ట్రైన్‌లో ఏర్పాటు చేశారు. దీని ద్వారా మరో ఉపయోగమేంటంటే భూకంపాలు వంటివి సంభవించి కరెంట్ సరఫరా నిలిచిపోయి వంతెన లేదా సొరంగం వంటి చోట్ల ఇరుక్కుపోతే.. ఈ బ్యాటరీ సహాయంతో సేఫ్ ప్లేస్‌కి రైలు వెళ్లడానికి సహాయ పడుతుంది.