కొత్త పుంతలు తొక్కనున్న బీహార్‌ ఎన్నికలు

ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు జరిగే ఆ ప్రక్రియ జనస్వామ్య కుంభమేళాను తలపిస్తుంది. ఎన్నికల రుతువులో ఎక్కడ చూసినా . సభలు, సమావేశాలు, ర్యాలీలే కనిపిస్తాయి.. ఇప్పుడా పరిస్థితి లేదు.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో ఎన్నికల ప్రక్రియ కొత్త దిశలో పయనించబోతున్నది.

కొత్త పుంతలు తొక్కనున్న బీహార్‌ ఎన్నికలు
Follow us

|

Updated on: Aug 24, 2020 | 4:08 PM

మనదేశంలో ఎన్నికలొస్తే చాలు ఓ పండుగ వాతావరణం నెలకొంటుంది.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు జరిగే ఆ ప్రక్రియ జనస్వామ్య కుంభమేళాను తలపిస్తుంది. ఎన్నికల రుతువులో ఎక్కడ చూసినా . సభలు, సమావేశాలు, ర్యాలీలే కనిపిస్తాయి.. ఇప్పుడా పరిస్థితి లేదు.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో ఎన్నికల ప్రక్రియ కొత్త దిశలో పయనించబోతున్నది.. డిజిటల్‌ వేదికలపై ఎన్నికల ప్రచారం జరగబోతున్నది.

ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.. దీని ప్రకారం ఒక్క ఓటింగ్‌ తప్ప ఎన్నికల ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.. మున్ముందు ఆన్‌లైన్‌ ఓటింగ్‌ వచ్చినా ఆశ్చర్యం లేదు.. ఇంతకు ముందు నామినేషన్‌ వేయడానికి కూడా మంది మార్బలాన్ని వెంటేసుకుని వెళ్లేవారు పేరున్న నాయకులు.. ఇప్పుడా దృశ్యాలు మచ్చుకు కూడా కనిపించవు.. ఎందుకంటే నామినేషన్‌ కూడా ఆన్‌లైన్‌లోనే వేసుకోవాలి.. డిపాజిట్‌ కూడా ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలి.. ఎన్నికల ప్రచారమూ అంతే! ఇంతకు ముందు కంటే ఎన్నికల సంఘానికి కొంత బరువు తగ్గినప్పటికీ కొత్త భారాలు మోయాల్సిన అవసరం ఏర్పడింది..

కరోనా నిబంధనలను అభ్యర్థులు పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని నిశితంగా గమనించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే! అందుకే మునుపటిలా ఎన్నికల ప్రచారం ఉండదు.. రాజకీయ సభలు, సమావేశాలు.. బహిరంగసభలు.. రోడ్ షోలు.. ర్యాలీలు జరగడానికి అవకాశమే లేదు.. కరోనా వైరస్‌ పూర్తిగా అంతరించేంతవరకు ఈ పరిస్థితి తప్పదు.. ఎన్నికల ప్రచారంలో అయిదుగురుకు మించి పాల్గొనడానికి లేదు.. రోడ్డు షోలూ అంతే…అయిదు వాహనాల కంటే ఎక్కువ కనిపించాయా అంతే సంగతులు.. అందుకే రాజకీయపార్టీలు సోషల్‌ మీడియానే నమ్ముకున్నాయి.. తమ భవిష్యత్తు భారాన్ని వాటిపై మోపాయి.. వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా వీలైనంత ఎక్కువ ప్రచారం జరుపుకునేందుకు వర్క్‌ అవుట్‌ చేసుకుంటున్నాయి. రెండు నెలల కిందట బీహార్‌కు చెందిన తొమ్మిది విపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఓ ఫిర్యాదు చేశాయి.. దాని సారాంశమేమిటంటే సోషల్‌ మీడియాలో బీజేపీ తప్పుడు వార్తలు, కథనాలు ప్రచారం చేస్తున్నదని…! ఈ కంప్లయింట్‌కు ఎన్నికల సంఘం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అది వేరే సంగతి..

అయితే, ఇప్పుడు బీహార్‌లో విజయం సాధించడం బీజేపీకి అత్యవసరం.. ఇప్పుడున్న పరిస్థితులలో జన సమూహాలలో ప్రచారం చేయడం కష్టమే కనుక సోషల్‌ మీడియాపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.. వర్చువల్‌ ర్యాలీలతో ప్రజలలలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది.. ఇలాంటి ర్యాలీలను నిర్వహించడంలో బీజేపీ ఎంతో అనుభవం గడించింది. ఇక బీజేపీ గెలుపు కోసం 9,500 మంది ఐటీ హెడ్స్‌ నిరంతరం పని చేస్తున్నారు. 72 వేల వాట్సప్‌ గ్రూపులు ఉండనే ఉన్నాయి.. డిజిటల్‌ ప్రచారంలో బీజేపీ మిగతా పార్టీల కంటే ఓ అయిదారు అడుగుల ముందే ఉంది.. ఆఖరికి పల్లెల్లో కూడా డిజిటల్‌ ప్రచారం చేస్తున్నదా పార్టీ.. ఇక ప్రతి శక్తి కేంద్రంలో కూడా వర్చువల్ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది.. బీజేపీలోని ప్రధాన నాయకులంతా వీటి ద్వారా ప్రచారం చేయబోతున్నారు.. వీటి ద్వారానే తమ ప్రసంగాలను వినిపించబోతున్నారు.

మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్‌, కాంగ్రెస్‌ కూటమి ఇప్పటి వరకు ప్రచారమే మొదలు పెట్టలేదు.. ఆసలు ఆ కూటమికి ఆన్‌లైన్‌లో ప్రచారం చేసుకోవాలన్నదానిపై ఆసక్తి లేనట్టు అనిపిస్తోంది.. ఆర్ధికవనరుల కొరత కూడా ఓ కారణం కావచ్చు.. డిజిటల్‌ ప్రచారం ద్వారా కొత్త పుంతలు తొక్కాలని బీజేపీ భావిస్తోంది. బీహార్‌లో స్మార్ట్‌ ఫోన్‌లు 27 శాతం మంది చేతుల్లోనే ఉన్నాయి.. అయినప్పటికీ బీజేపీ చేస్తున్న డిజిటల్‌ ప్రచారం మాత్రం ఎలాగోలా అందరికీ చేరుతోంది.. ఇప్పుడు జనాలకు నేతల వాగ్ధాటి అవసరం లేదు.. ఒకప్పుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మాట్లాతున్నారంటే జనం ఆసక్తిగా వినేవారు.. ఆయన సభలకు జనం విరగబడి వచ్చేవారు.. ఆయనేసే వ్యంగ విరుపులకు చప్పట్టు కొట్టేవారు.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఆ సంగతులేమీ ఉండవు.. సోషల్‌ మీడియాలో ఎవరెంత ప్రాపగాండా చేసుకుంటారో వారే కింగ్‌! సోషల్‌ మీడియాలో ఇప్పటికే బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది..

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సోషల్‌ మీడియాలో ప్రచారం కోసం 27 కోట్ల రూపాయలు వెచ్చింది.. కాంగ్రెస్‌ మాత్రం అయిదున్నర కోట్ల దగ్గరే ఆగిపోయింది. ట్విట్టర్‌లో బీజేపీకి 14.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఇందులో సగం కూడా లేరు.. ఇక ఆర్‌జేడీకి అయితే నాలుగు లక్షలు ఉంటే ఎక్కువ.. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటం కంటే సోషల్‌ మీడియా ద్వారా ఇంటింటికి చేరే ప్రయత్నం చేస్తున్నాయి పార్టీలు. ఈ విషయంలో బీజేపీ-జేడీయూలకే ఎక్కువ లబ్ధి చేకూరబోతున్నది.. ఎందుకంటే ఓ పక్క నరేంద్రమోదీ ఇమేజ్‌.. మరో పక్క నితీష్‌కుమార్‌ ఇమేజ్‌ … ఓ రకంగా డబల్ ధమాఖ అన్నమాట! ఇంత ఛరిస్మా ఉన్న నేతలు పక్క పార్టీలలో లేరన్నది వాస్తవం. డిజిటల్‌ ఎన్నికల ప్రచారమంటూ ఒకటుంటుందని 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి తెలిసింది. ఇష్యూ బేస్డ్‌ ప్రచారం నుంచి ఇమేజ్‌ బేస్ట్‌ ప్రచారం మొదలైంది కూడా అప్పుడే! 2015లో నితీశ్‌ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా డిజిటల్‌ ప్రచారం దోహదపడింది.. నితిశ్‌ కే సాత్ నిశ్చయ్‌ అన్న నినాదం జనాల్లోకి దూసుకెళ్లింది. మొత్తం మీద బీహార్‌ ఎన్నికలు ఈసారి కొత్తగా జరగబోతున్నాయి..