Ugadi 2023: ఉగాది నుంచి ఈ రాశుల వారికి అదృష్ట యోగం.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశిఫలాలు..

| Edited By: Janardhan Veluru

Mar 20, 2023 | 6:00 PM

తెలుగువారి నూతన సంవత్సర కాలంలో వివిధ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది.

Ugadi 2023: ఉగాది నుంచి ఈ రాశుల వారికి అదృష్ట యోగం.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశిఫలాలు..
Ugadi 2023 Horoscope
Image Credit source: TV9 Telugu
Follow us on
తెలుగువారి నూతన సంవత్సర కాలంలో వివిధ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది.  మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం 5, వ్యయం 5
రాజపూజ్యం 3, అవమానం 1.
ఈ రాశి వారికి ఈ ఏడాదంతా శని 11వ స్థానంలోనూ, గురువు రాశిలోనూ, రాహువు వ్యయం లోనూ, కేతువు 6లోనూ సంచరించడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. సానుకూల మార్పులు, చేర్పులు జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంలో చాలావరకు మెరుగుదల కనిపిస్తుంది. రుణ బాధ పూర్తిగా తగ్గిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి.
మారనున్న జీవితం
జూలై, నవంబర్ నెలల మధ్య సంస్కారవంతమైన కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశాలలో ఉద్యోగం సంపాదించడానికి, అక్కడ స్థిరపడటానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ఐటీ వంటి వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో సత్ఫలితాలను పొందుతారు. శుభవార్తలు వింటారు.
కుల దైవానికి పూజలు
ఈ రాశి వారికి ముఖ్యంగా మే నెల నుంచి నవంబర్ వరకు విపరీత రాజయోగం పట్టడానికి అవకాశం ఉంది. నవంబర్ తర్వాత కూడా ఆశించిన స్థాయిలో సంపాదన పెరగవచ్చు. అశ్విని భరణి నక్షత్రాల వారు అధికంగా అదృష్టాన్ని లేదా ఆకస్మిక ధన లాభాన్ని అనుభవించే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎక్కువగా ఇష్ట దైవాన్ని లేదా కుల దైవాన్ని పూజించడం వల్ల మరింతగా సత్ఫలితాలు పొందటానికి అవకాశం ఉంటుంది.
వృషభ రాశి (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం 14, వ్యయం 11
రాజపూజ్యం 6, అవమానం 1.
ఈ రాశి వారికి ఏప్రిల్ 23 నుంచి గురువు వ్యయం లోనూ, అక్టోబర్ చివరి వారి నుంచి రాహువు లాభ స్థానంలోనూ, కేతువు పంచమ స్థానం లోనూ సంచరించడం జరుగుతుంది. ఈ ఏడా దంతా శని దశమ స్థానంలో కొనసాగటం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా తిరుగులేని అదృష్టం పట్టడం ఖాయమని చెప్పవచ్చు. ఆదాయానికి, సంపాదనకు, లాభాలకు లోటు ఉండదు కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. గురు గ్రహం వ్యయ రాశి సంచారం వల్ల డబ్బు విషయంలో మోసపోవటం కానీ, మిత్రుల వల్ల నష్టపోవటం కానీ జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అయి.
త్వరలో మంచి మలుపు
మనశ్శాంతి ఏర్పడుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగం పట్టవచ్చు. ఆహార విహారాల విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఈ ఏడాది మే మొదటి వారం నుంచి వీరికి అనేక విషయాలలో అదృష్టం పట్టడం ప్రారంభం అవుతుంది.
పరిహారం అవసరం
ఈ రాశి వారు అనవసర పరిచయాలకు, విలాసాలకు, అక్రమ సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది. కృత్తిక, మృగశిర నక్షత్రాల వారి కంటే రోహిణి నక్షత్రం వారికి మరిన్ని శుభ పరిణామాలు అనుభవానికి రావడం జరుగుతుంది. ఈ రాశి వారు ఎక్కువగా శివార్చన చేయటం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా పొందుతారు.
మిథున రాశి (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం 2, వ్యయం 11
రాజపూజ్యం 2, అవమానం 4
ఈ ఏడాది భాగ్య స్థానంలో శనీశ్వరుడు, లాభ స్థానంలో గురువు, లాభ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల, ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయని చెప్పవచ్చు. ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుని జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది. మంచి ఉద్యోగం లభించడం లేదా మంచి ఉద్యోగంలోకి వెళ్లడం, తద్వారా జీవితంలో ఆర్థికంగా స్థిర పడటం వంటివి జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.
త్వరలో శుభ ఫలితాలు
నిరుద్యోగులకు దూరప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఈ ఏడాది జూలై నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వీరి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండటం మంచిది. వ్యాపారులు, వివిధ వృత్తుల వారు, ఐటీ నిపుణులు ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలను పొందడం జరుగుతుంది.
దుర్గా దేవిని పూజించండి
పునర్వసు నక్షత్రం వారు అత్యధికంగా ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. వీరికి ఈ ఏడాది గృహ, వాహన లాభాలు కలిగే అవకాశం ఉంది. అయితే మిత్రుల వల్ల మోసపోవటం కానీ నష్టపోవటం గాని జరిగే ప్రమాదం ఉంది. ఈ రాశి వారు ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధించడం వల్ల ఆశించిన సత్ఫలితాలను త్వరగా పొందటానికి అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం 11, వ్యయం 8
రాజపూజ్యం 5, అవమానం 4.
ఈ ఏడాది శని అష్టమంలోనూ, గురువు, రాహువులు దశమంలోనూ, కేతువు చతుర్ధం లోనూ సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను అనుభవించడం జరుగు తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కష్టపడటం వల్ల కొద్దిపాటి ఫలితం ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసు ఒకటి సానుకూలపడే అవకాశం ఉంది. దాయాదులతో వివాదాలు కొనసాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. అడపాదడపా ఆరోగ్యం చికాకు కలిగిస్తుంది.
జూలై అనుకూల సమయం 
నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. జూలై తరువాత వీరికి వృత్తి వ్యాపారాలపరంగా బాగా కలిసి వస్తుంది. వివాదాలకు, విభేదాలకు దూరంగా ఉండటం మంచిది.
అష్టమ శనితో సమస్య
ఆశ్రేష నక్షత్రం వారి కంటే పుష్యమి నక్షత్రం వారికి మరింత బాగుండవచ్చు. అష్టమ శని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. తరచూ వినాయకుడిని ప్రార్థించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం 14, వ్యయం 2
రాజపూజ్యం 1, అవమానం 7.
ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు, నవమ స్థానంలో గురు రాహువులు, మూడవ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ ఏడాది వీరికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. భాగ్యరాశిలో గురు రాహువుల సంచారం వల్ల వీరికి కొన్ని అనుకోని అదృష్టాలు పట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో సంపాదన, వృత్తిలో ఆదాయం, వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరగవచ్చు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు తిరిగి చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు కావచ్చు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఇవన్నీ మే నెల మొదటి వారం నుంచి ఈ ఏడాది చివరి వరకు కొనసాగటం జరుగుతుంది.
రాజకీయంగా అనుకూలం 
రాజకీయ నాయకులకు ప్రాభవం పెరుగుతుంది. వారికి అధికార యోగం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. పిల్లలు కొద్ది శ్రమతో మంచి ఫలితాలను పొందవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే, ఇంటా బయటా బాగా ఒత్తిడి శ్రమ ఉంటాయి.
శివారాధన తప్పదు
మఖ నక్షత్రం వారి కంటే పుబ్బ నక్షత్రం వారికి పై శుభ ఫలితాలు మరింత ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఈ రాశి వారు ఎక్కువగా శివుడిని ఆరాధించటం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి అవకాశం ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి.
కన్యా రాశి (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం 2, వ్యయం 11
రాజపూజ్యం 4, అవమానం 7.
ఈ ఏడాది ఆరవ స్థానంలో శని, 8వ స్థానంలో గురు రాహువులు, రెండవ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఎక్కువగా ప్రతికూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. పని భారం పెరిగి శ్రమ అధికం అవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు, దుబారా పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం కావటానికి ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. పిల్లలు బాగా ఒత్తిడికి గురవటం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం ఎక్కువగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆస్తి సంబంధమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.
జాగ్రత్త ప్రధానం
ఉత్తర నక్షత్రం వారికి కొన్ని ఫలితాలు మిగిలిన నక్షత్రాల కంటే మెరుగ్గా ఉంటాయి. ఈ రాశి వారు ఇతరుల విషయాల్లో తల దూర్చకపోవటం చాలా మంచిది. ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం 14, వ్యయం 11
రాజపూజ్యం 7, అవమానం 7.
ఈ ఏడాదంతా ఈ రాశి వారికి పంచమంలో శనీశ్వరుడు, సప్తమంలో గురు రాహువులు, మొదటి స్థానంలో కేతువు సంచరించడం వల్ల, జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టడం ఖాయం అని చెప్పవచ్చు. ఆదాయం, సంపాదన, లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలు ఉన్నాయి. అక్రమ సంపాదన విషయంలో అతి జాగ్రత్తగా ఉండటం మంచిది.
మే నుంచి అదృష్టం
నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో చక్కని ఉద్యోగం లభించ వచ్చు. విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారులు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తారు. కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మే నెల నుంచి అదృష్టం బాగా కలిసి వస్తుంది.
ఇష్ట దైవానికి పూజ
ఇతర నక్షత్రాల కంటే స్వాతి నక్షత్రం వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కొద్దిగా విచక్షణా జ్ఞానంతో వ్యవహరించడం మంచిది. ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం 5, వ్యయం 5
రాజపూజ్యం 4, అవమానం 5
ఈ రాశి వారికి ఈ ఏడాదంతా శనీశ్వరుడు నాలుగవ రాశిలోనూ, గురు రాహువులు ఆరవ రాశిలోనూ, కేతువు వ్యయంలోనూ సంచరిం చడం జరుగుతోంది. దీని ఫలితంగా ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను అనుభవించడం ఖాయం అని చెప్పవచ్చు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులను తరచూ వాయిదా వేయవలసి వస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఉద్యోగం, ఇల్లు మారడం జరుగుతుంది. సహనంతోను, సామరస్యంతోను, సంయమనం తోనూ వ్యవహరించాల్సి ఉంటుంది.
పిల్లల నుంచి శుభ వార్తలు
పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు తమ ఉద్యోగ ప్రయత్నాలను మరింత ఉధృతం చేయవలసి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. అవసరానికి డబ్బు అందుతూ ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది.
పరిహారం అవసరం
అనురాధ నక్షత్రం వారికి కొద్దిగా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొందరు బంధువుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం 8, వ్యయం 11
రాజపూజ్యం 6, అవమానం 3
మూడవ స్థానంలో శని, ఐదవ స్థానంలో గురు రాహువులు, 11వ స్థానంలో కేతు సంచారం వల్ల ఈ ఏడాది ఈ రాశి వారికి జీవితమంతా శుభమయంగా ఉంటుంది. శుభవార్తలు, శుభ పరిణామాలు, శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. సమాజంలో మాటకు విలువ ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తే చాలా బాగుంటుంది.
ఏడాదంతా శుభమే..
దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విందులు, వినోదాలకు, విహార యాత్రలకు అవకాశం ఉంది. ఐటి వంటి వృత్తి నిపుణులకు అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.
అన్నదానం మంచిది
ఈ ఏడాదంతా పూర్వాషాడ నక్షత్రం వారికి మరింత ఎక్కువగా ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా పూజిస్తే అదృష్టం పూర్తి స్థాయిలో మీది అవుతుంది. అన్నదానం చేయటం వల్ల, పేదలకు సహాయపడటం వల్ల ఎక్కువగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2,)
ఆదాయం 11, వ్యయం 5
రాజపూజ్యం 5, అవమానం 6
ధనస్థానంలో శనీశ్వరుడు, సుఖస్థానంలో గురు రాహులు దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నందు వల్ల ఈ రాశి వారు ఈ ఏడాది కొన్ని వ్యక్తిగత సమస్య నుంచి ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమై మనశ్శాంతి ఏర్పడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా పని భారం పెరిగినప్పటికీ ఉద్యోగ జీవితం సంతృప్తి కరంగా సాగిపోతుంది.
త్వరలో మంచి ఉద్యోగం
మంచి ఉద్యోగానికి మారే అవకాశం కూడా ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది. కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగి పోతుంది. పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
మార్చి నుంచి మంచి రోజులు
మార్చి నెల చివరి వారం నుంచి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. కొందరు స్నేహితులను గుడ్డిగా నమ్మటం వల్ల సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్త.
శివ పూజ అవసరం
ఉత్తరాషాడ, శ్రవణం నక్షత్రాల వారు మరింతగా శుభ ఫలితాలను అనుభవిస్తారు. నమ్మకద్రోహం చేసేవారు ఉంటారని అర్థం చేసుకోవడం మంచిది. ఎక్కువగా శివుడిని ధ్యానించడం వల్ల కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టే ఫలీ అనే సూత్రాన్ని నమ్ముకుని ఉండండి.
కుంభ రాశి (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయం 11, వ్యయం 5
రాజపూజ్యం 6, అవమానం 1.
మొదటి రాశిలో శనీశ్వరుడు, మూడవ రాశిలో గురు రాహువులు, భాగ్య స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ ఏడాది ఈ రాశి వారికి సానుకూల పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు, పని భారం పెరుగుతాయి.
శని ప్రభావం
ఏలినాటి శని ప్రభావం వల్ల శ్రమ తిప్పట ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు మెరుగు పడటానికి అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు లాభిస్తాయి. నిరుద్యోగులు గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.
జూలై నుంచి మంచి కాలం
 ఐ టి, ఇంజనీరింగ్ టెక్నాలజీ టెక్నికల్ రంగాలకు చెందిన వారికి మంచి అవకాశాలు అంది వస్తాయి. ఏ ఉద్యోగం అయినప్పటికీ శారీరక శ్రమ అనివార్యం అవుతుంది. పిల్లలు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. సాధారణంగా జూలై నుంచి ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల ఉంటుంది. తీర్థ యాత్రలకు, దూర ప్రయాణాలకు, విహార యాత్రలకు అవకాశం ఉంది.
పరిహారాలు
శతభిషం పూర్వాభాద్ర నక్షత్రాల వారికి వృత్తి ఉద్యోగాలపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను పొందటానికి అవకాశం ఉంటుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిం చాల్సిన అవసరం ఉంది. స్నేహం ముసుగులో అవాంఛనీయ శక్తులు చుట్టూ చేరే ప్రమాదం ఉంది.
మీన రాశి (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం 8, వ్యయం 11
రాజపూజ్యం 1, అవమానం 2.
వ్యయంలో శని, రెండవ స్థానంలో గురు రాహులు అష్టమంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఈ ఏడాది ఎక్కువగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయని చెప్పవచ్చు. ఊహించని విధంగా ధన సంపాదన పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి విలువ రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో గణనీయంగా మెరుగుదల ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. రుణ సమస్యలు బాగా తగ్గుతాయి. వడ్డీ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. అనవసర ఖర్చుల్ని విలాసాలను బాగా తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది.
ఏప్రిల్ నుంచి అనుకూలం 
ఉద్యోగ పరంగా బదిలీ లేదా స్థాన చలనానికి అవకాశం ఉంది. గృహ యోగానికి అవకాశం ఉంది. స్పెక్యులేషన్, ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఏప్రిల్ నెల చివరి వారం నుంచి ఆర్థిక స్థితిలో మార్పు చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఎటువంటి మార్పును ఆశించకుండా యధాతధ స్థితిని కొనసాగించడం మంచిది. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది. నిరుద్యోగులు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదించుకొని అవకాశం ఉంది.
పరిహారాలు
ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ పరంగా కూడా ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. అధికారులతో అతి జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. బంధు మిత్రులతో ఆర్థిక వ్యవహారాలు పెట్టుకోవడం ప్రస్తుతానికి మంచిది కాదు. వినాయకుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి.
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..