
చంద్రగ్రహణం రోజునే హోలీ పండుగ రావడం వల్ల ఈసారి ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. హోలీ చెడుపై మంచి విజయానికి ప్రతీకగా భావించబడుతుంది. రంగుల పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం, ఉత్సాహం, కొత్త ఆశలను నింపుతుందని విశ్వసిస్తారు. హోలీ తేదీ నిర్ణయంలో పౌర్ణమి తిథి కీలక పాత్ర పోషిస్తుంది. 2026 మార్చి 3, మంగళవారం హోలికా దహనం జరగనుంది. అయితే అదే రోజు చంద్రగ్రహణం సంభవించనుండటంతో పూజా విధానాల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. జ్యోతిష్య నిపుణుల సూచనల ప్రకారం గ్రహణం ముగిసిన తరువాతే హోలికా దహనం చేయడం శ్రేయస్కరం. మార్చి 2 పౌర్ణమి ఘడియల్లో భద్రకాలానికి ముందుగా హోలికా దహనం నిర్వహించి, మార్చి 3న గ్రహణ కారణంగా ప్రధాన పూజలు నివారించి, మార్చి 4న రంగుల పండుగ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఈ చంద్రగ్రహణం పూర్వ ఫల్గుణి (పుబ్బ) నక్షత్రంలో, సింహ రాశిలో కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తూ కేతుతో సమీపంలో ఉండటం వల్ల కొన్ని రాశులపై దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే మార్చి 2 నుంచి సూర్యుడు, బుధుడు, రాహువు, కుజుడు కలిసి కుంభరాశిలో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది కొన్ని రాశులకు శుభఫలితాలు ఇస్తే, మరికొన్నివారికి పరీక్షల కాలంగా మారవచ్చు.
అలాగే ధనస్సు, మేషం, కన్య రాశుల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పుబ్బ నక్షత్ర జాతకులు జాగ్రత్తలు పాటించాలి.
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఈ గ్రహణం రాజకీయ, సామాజిక రంగాల్లో మార్పులకు దారితీయవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, దేశాధినేతలు, వైద్య రంగానికి చెందినవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విభేదాలు, ఆరోగ్య సమస్యలు, పరస్పర విమర్శలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఈసారి హోలీ, చంద్రగ్రహణం కలిసివచ్చినందున ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వాసాలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ, ఆనందంగా పండుగను జరుపుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)