
దసరా సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉచితంగా దుర్గమ్మ దర్శనం భక్తులకు కల్పించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్ల విధానాన్ని దసరా సందర్భంగా రద్దు చేశారు. టికెట్లతో అవసరం లేకుండా అందరికీ ఉచిత దర్శన భాగ్యం కల్పించనున్నారు. అన్ని క్యూలైన్లలోకి ఉచితంగా ప్రవేశంచి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. దసరా ఉత్సవాల్లో దుర్గగుడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు భక్తులు ఎలాంటి టికెట్ లేకుండా దుర్గమ్మను దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అన్ని క్యూలైన్లను ఉచిత క్యూలైన్లగా కొనసాగించనున్నారు.
సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక వీఐపీ, అధికారిక సిఫార్సులపై వచ్చే భక్తుల కోసం భవానీ ప్రత్యేక దర్శనం పేరుతో ప్రత్యేక క్యూలైన్ అందుబాటులో ఉంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికార సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు మాత్రమే ఈ ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శన అవకాశం ఉంటుంది. అయితే వీరికి టికెట్ ధర రూ.వెయ్యిగా నిర్ణయించారు. ఈ టికెట్ తీసుకుని ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఈ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇంద్రకీలాద్రి సమీపంలోని కుమ్మరిపాలెం వద్ద టీటీడీ స్థలంలో ఈ టికెట్లను జారీ చేసేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడికి వెళ్లి ఆఫ్‌లైన్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. అలాగే కాళేశ్వరరావు మార్కెట్, స్వరాజ్య మైదానం వద్ద కూడా దర్శన టికెట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రూ.వెయ్యి దర్శనం టికెట్ తీసుకున్న భక్తులను ప్రత్యేక వాహనాల్లో కొండపైకి తీసుకొస్తారు. అనంతరం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా నేరుగా దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళలల్లో ఒక్కొ ట్రిపుకు రెండు గంటల చొప్పున ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. రోజంతా ఈ దర్శనాలకు అవకాశం ఉండదు. ఏ సమయంలో టికెట్లు ఇవ్వాలనేది అధికారులు త్వరలో నిర్ణయించనున్నారు. ఇక సామాన్య భక్తులకు ఐదు క్యూలైన్ల ద్వారా దర్శనం ఉంటుంది. వినాయక ఆలయం, కుమ్మరిపాలెం నుంచి భక్తులు ఐదు క్యూలైన్లలో దర్శనానికి అనుమతించనున్నారు,. ఘాట్ రోడ్డు వద్దకు చేరుకున్నాక మూడు క్యూలైన్లుగా మారతాయి. ఆ తర్వాత టర్నింగ్ పాయింట్ నుంచి ఐదు క్యూలైన్లుగా మారతాయి. శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.