
విజయవాడ – బెంగళూరు మధ్య నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే – 544జీ పనుల్లో కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. మొత్తం ఆరు వరుసల్లో (6 లేన్లు) 518 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించబోతున్నారు. ఈ హైవే విజయవాడ నుంచి ప్రారంభమై గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా కడప జిల్లాకు చేరుకుంటుంది. అయితే, ఈ హైవేపై అధికారులు సొరంగ మార్గాలను కూడా నిర్మిస్తున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం నుంచి కడప జిల్లా వరకు వేర్వేరుగా రెండు సొరంగాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రెండింటి మధ్య మొత్తం 7.5 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించనున్నారు. రూ.801 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 2025లో అనుమతులు లభించగా, గత జూన్ నెలలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
కాంట్రాక్ట్ సంస్థ ప్రకారం.. ఈ హైవేపై నిర్మించబోయే ఒక్కో టన్నెల్ సుమారు 3 కిలోమీటర్లకు పైనే ఉండనుంది. అలాగే 16.7 మీటర్ల వెడల్పు, 10.4 మీటర్ల ఎత్తుతో వీటిని నిర్మించనున్నట్లు స్పష్టం చేసింది. కాంక్రీట్ లైనింగ్ పూర్తయిన తర్వాత ఇవి 14.7 మీటర్ల వెడల్పు, 9 మీటర్ల ఎత్తుతో ఉంటాయని పేర్కొంది. 2027 నాటికి కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తి చేసి, అదే సంవత్సరం డిసెంబర్ నాటికి సొరంగాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కాంట్రాక్ట్ సంస్థ తెలిపింది.
ఇకపోతే, తాజాగా నిర్మిస్తున్న ఈ 6 లేన్ల నేషనల్ హైవేను నెల్లూరు జిల్లా సీతారామపురం మీదుగా తీసుకెళ్లి 167 బీజీ, 167 బి హైవేలకు అనుసంధానిస్తారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే శ్రీ సత్యసాయి జిల్లాలోని కోడికొండ వద్ద ప్రారంభమై కడప, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రకాశం జిల్లా ముప్పవరం వద్ద నేషనల్ హైవే-16తో కలుస్తుంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాల ప్రవేశ (ఎంట్రీ), నిష్క్రమణ (ఎగ్జిట్) మార్గాలు మారనున్నాయి. ప్రయాణికులు కేవలం 13 ప్రాంతాల్లో మాత్రమే ఈ హైవేపైకి ప్రవేశించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.