
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మే 21 నుండి జూన్ 2వ తేదీ వరకు ఈ-వేలం ద్వారా భక్తులు శ్రీవారికి సమర్పించిన వస్త్రాలను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఈ-వేలంలో కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బ తిన్నవి కలిపి మొత్తం 505 వస్త్రాల దాక అందుబాటులో ఉన్నాయి. వీటిలో పాలిస్టర్, నైలాన్, కాటన్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్ పీస్‌లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్‌షీట్లు, దిండు కవర్లు, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, పరదాలు, శిరోవస్త్రాలు, గొడుగులు, హుండీ గల్లేబులు, ఈర్వాడాలు తదితర వస్త్ర సామగ్రి ఉన్నట్లు టిటిడి పేర్కొంది. ఆసక్తి గల వారు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించవచ్చని ప్రకటన విడుదల చేసింది. అలాగే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org సంప్రదించ వచ్చని తెలిపింది.
ఇకపై మేలిరకం పట్టు వస్త్రాలు శాలువాలు
ఇదిలా ఉండగా టీటీడీ పట్టు వస్త్రాలు, శాలువాల కొనుగోళ్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నాసిరకం వస్త్రాలు, శాలువాల కొనుగోళ్లు జరిగాయని భావించిన టీటీడీ కొనుగోళ్లపై ఫోకస్ పెట్టింది. గతంలో నాణ్యత లేని పట్టు వస్త్రాలు, శాలువాల కొనుగోళ్లు జరిగాయని, అందులో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ద్వారా టీటీడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో పట్టుకు బదులు పాలిస్టర్ వస్త్రాలను ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్న VRS ఎక్స్‌పోర్ట్, దాని అనుబంధ సంస్థల టెండర్లను టీటీడీ ఇప్పటికే రద్దు చేసి, ఆ కాంట్రాక్టర్లకు గతేడాది డిసెంబర్‌లోనే చెక్ పెట్టింది. ఒకవైపు ఈ వస్త్రాల స్కామ్‌పై విచారణ జరుగుతుండగానే, భక్తులకు వస్త్రాల కొరత రాకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇకపై ప్రైవేట్ కాంట్రాక్టర్లను పక్కనపెట్టి, కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆప్కో , తమిళనాడుకు చెందిన కో-ఆప్టెక్స్ సంస్థల నుంచే మేలు రకం వస్త్రాలను కొనుగోలు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఈ నాణ్యమైన పట్టు వస్త్రాలు, శాలువాల కొనుగోలు కోసం టీటీడీ బోర్డు రూ. 44.20 కోట్లను కేటాయిస్తూ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
టీటీడీ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వస్త్రాలను కొనుగోలు చేస్తుంది. వీటిని శ్రీవారిని దర్శించుకుని వేద ఆశీర్వచనం తీసుకునే భక్తులకు బహుకరించడానికి వినియోగిస్తారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ వింగ్ తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తులకు అందించే దుప్పటాలు, శాలువాల కొరత తీరడమే కాకుండా, వారికి నాణ్యమైన పట్టు వస్త్రాలు అందనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి