
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. అక్టోబర్ 11 తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అట్టాహాసంగా జరిపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాలు, దసరా పండుగ సెలవులు రావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ భారీగా పెరిగడంతో.. దీనికి తగ్గట్లు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పెరటాసి మాసం చివరి వారం కూడా వస్తుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ఈ కారణాలతో రాబోయే 10 రోజుల పాటు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. దీంతో 10 రోజుల పాటు వీఐపీ దర్శనాలను బంద్ చేయడంతో పాటు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారు వీటిని గమనించాలని టీటీడీ కోరింది.
అయితే బ్రహ్మోత్సవాల వేళ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది. చర్లపల్లి-తిరుపతి(07713) స్పెషల్ రైలు అక్టోబర్ 10,11,12వ తేదీల్లో అందుబాటులోకి ఉంటుంది. చర్లపల్లి నుంచి అక్టోబర్ 10న సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరనున్న ట్రైన్.. 11వ తేదీన ఉదయం 7.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో తిరుపతి-చర్లపల్లి(07714) రైలు అక్టోబర్ 11న మధ్యాహ్నం 2.45 గంటలకు తిరుపతిలో బయల్దేరి.. అక్టోబర్ 12న ఉదయం 4.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. తిరుమల శ్రీవారి భక్తులతో పాటు దసరాకు సొంతూరు వెళ్లేవారికి ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. ఈ రైళ్లు ప్రధాన స్టేషన్లు అన్నింటిలోనూ ఆగుతాయి. జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.
ఈ రైళ్లల్లో స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అటు పలు రైళ్లల్లో ఖాళీగా ఉన్న బెర్తుల సంఖ్యను రైల్వేశాఖ ప్రకటకించింది హెచ్.ఎస్. నాందేడ్-తిరుచానూరు(07603) స్పెషల్ ట్రైన్‌లో అక్టోబర్ 13న 544 బెర్తులు, అక్టోబర్ 20న 813, అక్టోబర్ 27న 843 బెర్తులు ఖాళీగా ఉన్నాయని ఒక లిస్ట్ విడుదల చేసింది. ఇక ఇదే రైలులో నవంబర్ 3న 911, నవంబర్ 10న 526, నవంబర్ 17న 871, నవంబర్ 24న 902 బెర్తులు ఖళీగా ఉన్నాయి. ప్రయాణికులు పండుగ కారణంగా సీట్లు దొరకవనే ఉద్దేశంతో ఉంటారు. దీంతో రైల్వేశాఖ ప్రతీరోజూ బెర్తుల ఖాళీల వివరాలను ప్రకటిస్తోంది. ఏయే రోజుల్లో ఎన్ని బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయనేది ఒక లిస్ట్ విడుదల చేస్తోంది.