అధికారంలో ఉన్నంతకాలం తూటాల్లాంటి డైలాగ్స్ ఆ ఫైర్ బ్రాండ్ స్పెషల్. ఎన్నికల్లో ఓటమితోనే సైలెన్స్. నియోజకవర్గానికే కాదు కేడర్‌తోనూ నో టచ్. ఇంతకీ వైసీపీలోని ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడుంది. నియోజకవర్గానికి దూరంగా ఎందుకుంది. పక్క రాష్ట్రంలోనే ఎక్కువ సమయం ఎందుకుంటోంది. కేడర్‌కు టచ్‌లో లేకపోవడానికి కారణమై ఉంటుంది..!
ఆర్కే రోజా. ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్. గత 5 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం నిత్యం వార్తల్లో ఉండే రోజా ఇప్పుడు ఒక్కసారిగా వాయిస్ వినిపించకుండా పోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని రోజా ఆ తర్వాతే నగరికి దూరంగా ఉంది. అడ్రస్ లేకుండా పోయిందన్న ప్రచారానికి తెర తీసింది. ఈ రెండు నెలల్లో ఒకటి రెండుసార్లు మాత్రమే చుట్టపు చూపుగానే నగరికి వచ్చి జనానికి కనిపించిన రోజా ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులోనే ఎక్కువగా ఉంటోంది. కుటుంబంతో కలిసి ఆలయాల చుట్టూ తిరుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నో కష్టాలు ఎదుర్కొని మంత్రి స్థాయికి ఎదిగిన రోజా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంది. అయితే రోజాకు నగరి ఓటర్లు ఆ ఛాన్స్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందింది. రాజకీయంగా అన్ని అవకాశాలను అంది పుచ్చుకున్న రోజా ఏపీ పాలిటిక్స్‌లో రెండు దశాబ్దాలకు పైగా నెట్టుకొచ్చింది. సొంత పార్టీలోని శత్రువులతో ఫైట్ చేస్తూ వచ్చిన రోజా ఎమ్మెల్యేగా, మంత్రిగా తగ్గేదేలేదన్నట్లు అధికారంలో రాణించింది. అయితే ఇప్పుడు ఆమె వాయిస్ వినిపించే పరిస్థితే లేకపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా విపక్షాలను, ఆయా పార్టీల అధినేతలను పదునైన డైలాగ్స్‌తో చీల్చి చెండాడిన రోజా ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటుందని జనంలో పెద్ద చర్చనే నడుస్తోంది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా మౌనం పాటిస్తున్న రోజా కుటుంబంతోనే ఎక్కువగా ఉంటోంది. నగరికి వస్తే ఇంట్లో, లేదంటే చెన్నైలో ఉంటున్న రోజా వీలున్నప్పుడల్లా ఆలయాల సందర్శన చేస్తోంది. ఒకటి రెండు సార్లు మాత్రమే రోజా నగరిలో పార్టీ కార్యకర్తలు, కార్యక్రమాలకు హాజరైనా.. మీడియాతో మాట్లాడటానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. మరోవైపు తమిళనాడు పాలిటిక్స్ పట్ల రోజా ఇంట్రెస్ట్‌గా ఉందన్న ప్రచారం కూడా నడుస్తోంది. తమిళనాడులో రోజాకున్న ఫాలోయింగ్, అక్కడి పార్టీలతో రోజాకు ఉన్న పరిచయాలు కూడా ఆమె తమిళ రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందన్న చర్చ కూడా ఆమె అభిమానుల్లో ఉంది. ఏపీ పాలిటిక్స్ పట్ల సైలెన్స్ పాటిస్తున్న రోజా తీరు ఇందుకు కారణమా అన్నట్లు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇంతకీ రోజా మౌనం, పొలిటికల్‌గా నిశ్శబ్దం ఎందుకు పాటిస్తుందో ఆమె చెప్పాల్సి ఉంది.
మరన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..