రేయ్ ఏంట్రా ఇది.. సూపర్ మార్కెట్‌తో బంపర్ లాభాలన్నారు.. కట్ చేస్తే, రూ.10కోట్లు వసూలు చేసి..

సూపర్ మార్కెట్ ఫ్రాంచైజీ పేరుతో నిరుద్యోగులను టార్గెట్ చేసిన ఓ సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఐదున్నర లక్షల డిపాజిట్ చేస్తే ఫ్రాంచైజీ ఇస్తామని నమ్మించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రేయ్ ఏంట్రా ఇది.. సూపర్ మార్కెట్‌తో బంపర్ లాభాలన్నారు.. కట్ చేస్తే, రూ.10కోట్లు వసూలు చేసి..
Guntur Scam

Edited By:

Updated on: Jun 02, 2026 | 3:34 PM

నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకొని ప్రైవేటు కంపెనీలు పలురకాల మోసాలకు పాల్పడుతున్నాయి. సూపర్ మార్కెట్ ఫ్రాంచైజీ అంటూ కోట్ల రూపాయలను డిపాజిట్ రూపంలో వసూలు చేసి మోసం చేసిన కంపెనీపై గుంటూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. బోర్డు తిప్పేసిన నిర్వాహకుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. స్టార్ హార్వెస్ట్ పేరుతో గుంటూరు కొరిటెపాడులో ఒక సూపర్ మార్కెట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాజు ప్రొప్రైటర్ గా శంకర్ రెడ్డి, దీపిక, రాణి ఉద్యోగులకా కార్యాలయం నడిపించారు. సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ మార్కెట్ ప్రాంఛైజీలు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. ఐదున్నర లక్షల డిపాజిట్ చేస్తే ఫ్రాంఛైజ్ ఇస్తామన్నారు.

సూపర్ మార్కెట్ కు అవసరమైన అన్ని వస్తువులు తామే ఇస్తామన్నారు. మార్కెట్ లో పనిచేసే ఇద్దరికి పది వేల చొప్పున జీతం చెల్లిస్తామన్నారు. షాపు అద్దె పదిహేను వేలతో పాటు కరెంట్ బిల్లు కూడా కంపెనీయే భరిస్తుందన్నారు. వీటన్నంటికంటే ఎక్కువగా సరుకుల అమ్మకాల్లో ఇరవై శాతం కమీషన్ చెల్లిస్తామన్నారు. దీంతో పాటు వంటింట్లో గిన్నెలు తోమే గ్రీన్ ప్యాడ్ కట్ చేసి ప్యాక్ చేసి తమకు అందిస్తే నెలనెలా పదిహేను వేల రూపాయలిస్తామని అందుకు అవసరమైన ముడి సరకు కూడా తామే చెల్లిస్తామంటూ మరొక మోసానికి పాల్పడ్డారు.

ప్రకటనలు చూడచక్కగా ఉండటం, కార్యాలయం నిర్వహిస్తుండటంతో నిరుద్యోగులు వీరి ఉచ్చులో పడ్డారు. వందల మంది డబ్బులు చెల్లించారు. పది కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. కాలం గడుస్తున్నా సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయకపోవడంతో అనుమానం వచ్చిన కొందరూ రాజును నిలదీశారు. అయితే అప్పటికే బోర్డు తిప్పేసిన నిర్వాహకులు అక్కడ నుండి ఉడాయించారు. ఈ క్రమంలోనే డబ్బులు చెల్లించిన కొంతమంది గుంటూరు గ్రీవెన్స్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపితో పాటు తెలంగాణలో కూడా ఈ సంస్థ బాధితులున్నట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు సిద్దమయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us