Weather Report: ఎండాకాలంలో చల్లని కబురు.. రెండ్రోజుల పాటు వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలు ఉపశమనం

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అదిరే చల్లని కబురు అందించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రెండ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల పలు జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటన జారీ చేసింది.

Weather Report: ఎండాకాలంలో చల్లని కబురు.. రెండ్రోజుల పాటు వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలు ఉపశమనం
Rains

Updated on: Apr 17, 2026 | 6:56 AM

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తీవ్రరూపం దాల్చుతున్నాడు. రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడితో పాటు వడగాల్పులు, ఉక్కబోతతో జనాలు భయపడిపోతున్నారు. రానున్న కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతవారణశాఖ హెచ్చరిస్తోంది. శుక్రవారం కూడా ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

ఏపీలో పెరిగిన ఎండ తీవ్రత

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, అల్లూరి సీతారామారాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 301 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక 55 మండలాల్లో సాధారణ వడగాలులు ఉంటాయని తెలిపింది. ఇక పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. అటు గురువారం నంద్యాల జిల్లా సంజామలలో 45.31 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వగా.. మార్కాపురం జిల్లాలోని అనుమలపల్లిలో 44.2 డిగ్రీలు, కడప జిల్లా ఒంటిమిట్టలో 44.9 డిగ్రీలు నమోదైంది.

తెలంగాణకు వర్షసూచన

ఇక తెలంగాణలో ఎండలు గత కొద్ది రోజులుగా దంచికొడుతున్నాయి. రానున్న ఆరు రోజుల పాటు అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య వడగాల్పులు వీస్తాయని, బయటకు రావొద్దని సూచించింది. గురువారం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో 44.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నిజామాబాద్ ,నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, నల్లగొండ, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీలను క్రాస్ చేసింది. అటు ఈ నెల 19, 20వ తేదీల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల వర్షాలు పడతాయని తెలిపింది. 19వ తేదీన ఖమ్మం, మెదక్, జగిత్యాల, ములుగు, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు పడనుండగా.. 20న నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. అధిక ఉష్ణోగ్రత వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల ఆకస్మిక వర్షాలు పడతాయని తెలిపింది. ఈ రెండ్రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు ఆయా జిల్లాల్లో పడతాయని తెలిపింది. ఎండ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షసూచనతో ఊరట కలిగినట్లయింది. వర్షాల తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

Follow Us