
తన ప్రాణాలు పోతున్నా.. బస్సులోని 40 మంది ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని చివరి క్షణాల్లోనూ డ్రైవర్‌గా తన బాధ్యతను నిర్వర్తించిన ఘటన అనకాపల్లి జిల్లాలో విషాదాన్ని నింపింది. గుండెపోటు వచ్చినా నొప్పిని భరిస్తూ.. బస్సును సురక్షితంగా పక్కకు నిలిపిన ఆర్టీసీ డ్రైవర్.. అనంతరం ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సు నక్కపల్లి జాతీయ రహదారి వద్దకు చేరుకుంది. అదే సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా తీవ్ర గుండెనొప్పి వచ్చినట్లు సమాచారం. అయితే పరిస్థితిని గుర్తించిన డ్రైవర్, ప్రయాణికుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా వెంటనే బస్సును రహదారి పక్కకు తీసుకెళ్లి సురక్షితంగా నిలిపారు.
ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురికావడంతో ప్రయాణికులు, స్థానికులు వెంటనే స్పందించారు. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ చివరి క్షణాల్లోనూ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. తన ప్రాణాలను కోల్పోయినా.. బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌పై స్థానికులు ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు. విషయం తెలిసి ఆర్టీసీ అధికారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..