2021-22 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్ సమర్పించింది. 2022 మార్చి 31 తేదీతో ముగిసిన సంవత్సరానికి సంబంధించిన నివేదికను అందజేసింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, రెవెన్యూ, రవాణా అంశాలపై నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చిన రూ.6,356 కోట్ల రూపాయల గ్రాంట్ మురిగిపోయింది. గత ఏడాదితో పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు రూ.24,257 కోట్ల మేర పెరిగాయని కాగ్ పేర్కొంది. FRBM చట్టం నిర్దేశించిన పరిమితి కంటే ఆఫ్ బడ్జెట్ రుణాలు 9.85 శాతం ఎక్కువగా ఉన్నాయి. రెవెన్యూ ఖర్చులు 4.25 శాతం మేర పెరిగాయి.
సామాజిక-ఆర్ధికాభివృద్ధి పథకాల కోసం అప్పులపై ఆధారపడకుండా అదనపు రెవెన్యూ వనరుల కోసం ప్రయత్నించాలని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఆస్తుల కల్పన-ఆర్ధికాభివృద్ధి కోసం మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచాలి. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని కాగ్ నివేదిక పేర్కొంది. ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండానే 2 వేల812 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆర్ధిక సంఘం గ్రాంట్లను పంచాయితీల విద్యుత్ బకాయిల పేరుతో రూ. 1351 కోట్ల రూపాయలు మినహాయించారు. స్థానిక సంస్థలకు చెందిన నిధుల్లో ఆర్ధికశాఖ కోత విధించటం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉంది.
రాష్ట్రంలో 17 ప్రభుత్వ రంగ సంస్థలు 3,387 కోట్ల రూపాయల నష్టాలను చవిచూశాయంటూ కాగ్ స్పష్టం చేసింది. నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ గృహవసతి పథకాన్ని మూలధన వ్యయంగా ప్రభుత్వం చూపింది. లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల స్థలాలు, ఇళ్లను రెవెన్యూ వ్యయంగా చూపాల్సి ఉంది. బడ్జెట్‌లో చూపని అదనపు రుణాలు పరిమితి కంటే అధికంగా ఉన్నాయి. స్మార్ట్ పట్టణాలు, కృషి వికాస్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్ లాంటి పథకాలకు రాష్ట్ర వాటా విడుదల కాకపోవటం వల్ల అవి సరిగా అమలు కాలేదని కాగ్ వివరించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..