Vizag: రాధా గాయత్రి మృతి కేసులో సంచలనం.. కీలక అప్ డేట్

విశాఖ టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుడైన భర్త శ్రీచరణ్ జైలు ఊచలు లెక్కపెడుతుంటే.. ఇటు డెహ్రాడూన్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాలతో మెజిస్టీరియల్ విచారణ ముమ్మరమైంది. ఈనెల 17న జరగబోయే విచారణతో ఈ మిస్టరీ వీడనుందా? అసలు ఆ మరణం వెనుక ఉన్న మర్మమేంటి?

Vizag: రాధా గాయత్రి మృతి కేసులో సంచలనం.. కీలక అప్ డేట్
Sri Charan - Radha Gayatri

Updated on: Jul 15, 2026 | 9:53 PM

విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి.. జూన్ 14వ తేదీ రాత్రి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. రాధా గాయత్రి అంత్యక్రియలు అయిపోయాక.. ఆమె చావుపై తీవ్ర అనుమానాలు ఉన్నాయంటూ పేరెంట్స్ ముస్సోరి పోలీసులకు కంప్లైంట్ చేశారు. స్థానిక అధికారులతో పాటు డీజీపీని కూడా కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో పోలీసులు మొదట నమోదైన సాధారణ కేసును కాస్తా.. భర్త శ్రీచరణ్‌పై హత్య కేసుగా మార్చారు.

మొదట నమోదైన సెక్షన్ 103(2) హత్య కేసు

హత్య కేసు నమోదు కాగానే.. అప్పటివరకు నేనేం తప్పు చేయలేదన్న శ్రీచరణ్ తప్పించుకోవడానికి ట్రై చేశాడు. అయితే, పోలీసులు అతని కోసం గాలిస్తుండగానే రాధా గాయత్రి పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్టులు బయటకొచ్చాయి. వీటిలో డైరెక్ట్‌గా చంపేసినట్టు బలమైన ఆధారాలు దొరకలేదు. దీంతో పోలీసులు హత్య కేసు సెక్షన్ 103(2) స్థానంలో.. కఠినమైన వరకట్న వేధింపుల సెక్షన్ 80(2) BNS కింద శ్రీచరణ్‌ను బుక్ చేసి జైలుకు పంపారు. మరోవైపు, తన కూతుర్ని ప్లాన్ ప్రకారమే చంపేశాడంటూ రాధా గాయత్రి తండ్రి ఆరోపిస్తున్నారు. బర్త్‌డే పేరుతో తీసుకెళ్లి తన కూతుర్ని పొట్టనబెట్టుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు తెలియకుండానే పోస్టుమార్టం పూర్తి

పోలీసుల దర్యాప్తు ఇలా ఉంటే.. మరోపక్క తమకు చెప్పకుండా, దొంగచాటుగా పోస్టుమార్టం చేసేశారంటూ బాధిత తల్లిదండ్రులు డెహ్రాడూన్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. దాంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ముస్సోరి డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ విచారణ మొదలుపెట్టారు. అసలు జూన్ 14 నుంచి 16 మధ్య ఏం జరిగింది? పోస్టుమార్టం కరెక్ట్‌గా జరిగిందా లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17న విచారణకు రావాలంటూ శ్రీచరణ్ పేరెంట్స్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఎంతో గారాబంగా పెంచుకున్న తన కూతురిని చంపేశారంటూ రాధా గాయత్రి తల్లి కన్నీటిపర్యంతం అయ్యారు. తన్ను ‘అమ్మా’ అని పిలిచే గొంతును లేకుండా చేశాడంటూ ఏడ్చేశారు.

ప్రస్తుతం ఒక పక్క పోలీస్ దర్యాప్తు.. ఇంకొకపక్క మెజిస్ట్రేట్ విచారణ చాలా స్పీడ్‌గా సాగుతున్నాయి. జూలై 17న జరిగే విచారణతో ఈ కేసులోని చిక్కుముడులన్నీ వీడుతాయని బాధితులు బలంగా ఆశిస్తున్నారు. మరి టెక్కీ రాధా గాయత్రి చావు వెనుక దాగున్న అసలు నిజాలు ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!

 

Follow Us