వర్షాల కోసం ఈగలపాడు గ్రామస్థుల వినూత్న మొక్కులు.. ట్యాంకర్లతో గ్రామదేవతలకు జలాభిషేకం

ఆ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడడం ఆగిపోయాయి, కరువు, కాటకాలు పెరిగిపోయాయి. అసలు ఏంటి ఈ పరిస్థితి అని గ్రామస్తులకు అర్థం కాలేదు.. ఇంతలో ఓ ప్రచారం స్టార్ట్ అయింది.. గ్రామదేవతలను పూజించకపోవడమే ఈ కరుకు కారణమని తెలియడంతో గ్రామస్తులంతా తమ తప్పును తెలుసుకొని.. దేవతలను పూజించడం ప్రారంభించారు. వర్షాలు కురవాలని గ్రామదేవతలను వేడుకున్నారు.

వర్షాల కోసం ఈగలపాడు గ్రామస్థుల వినూత్న మొక్కులు.. ట్యాంకర్లతో గ్రామదేవతలకు జలాభిషేకం
Special Prayers For Rain

Edited By:

Updated on: Jul 19, 2026 | 2:22 PM

తరతరాల నుండి వస్తున్న సంప్రదాయాలను విస్మరించడం వల్లే తమ గ్రామంలో కరువు తాండవిస్తోందని మార్కాపురం జిల్లా, పొదిలి మండలం ఈగలపాడు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ దేవతలకు ధూపదీప నైవేద్యాలు పెట్టడం మానేయడం వల్లే గత కొన్నేళ్లుగా వర్షాలు కురవడం లేదనే ప్రచారంతో గ్రామస్థులు, తాజాగా తమ తప్పును సరిదిద్దుకునేందుకు పూనుకున్నారు.

గ్రామ దేవతలను పట్టించుకోకపోవడం వల్లే వానలు పడడం లేదని భావించిన గ్రామస్థులు, వెంటనే ట్యాంకర్లతో నీటిని తెప్పించి విగ్రహాలకు జలాభిషేకాలు నిర్వహించారు. నిమ్మకాయలు, పూలు, కుంకుమ, పసుపుతో దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. వానలు సమృద్ధిగా కురవాలని, గ్రామం పచ్చగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ మహిళలు, స్థానికులు మాట్లాడుతూ.. గ్రామంలో వర్షాలు పడక కొన్ని సంవత్సరాలు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ దేవతలకు ఎటువంటి రక్షణ, సౌకర్యం లేకపోవడంతో విగ్రహాలు ఎండకు, వానకు తడుస్తూ ఉండిపోయాయని, ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే గ్రామంలో ఉన్న అన్ని గ్రామదేవతల విగ్రహాలకు ప్రత్యేకంగా గుడులు నిర్మించాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. గుడి కట్టడం ద్వారా నిత్యం పూజలు జరుగుతాయని, తద్వారా గ్రామ దేవతలు ప్రకాశిస్తూ ఊరిని చల్లగా చూస్తారని వారు నమ్ముతున్నారు. ఇకపై ఏ పని చేసినా గ్రామ దేవతల దగ్గర మొక్కులు తీర్చుకున్నాకే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా గ్రామస్థులంతా కలిసికట్టుగా పూనుకొని గ్రామ దేవతలకు గుడి నిర్మించాలని పలువురు మహిళలు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us