ఏడుగురు.. ఏడుగురు! చివరకు లాటరీతో తేలిన డుంబ్రిగూడ ఎంపీపీ ఎన్నిక!

అల్లూరి జిల్లా డుంబ్రిగూడ ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠభరితంగా ముగిసింది. ఎంపీపీ పదవి కోసం పోటీ పడిన రెండు వర్గాలకూ ఏడుగురు చొప్పున ఎంపీటీసీల మద్దతు లభించడంతో ఎన్నిక టైగా మారింది. దీంతో అధికారులు లాటరీ నిర్వహించగా.. కూటమి బలపరిచిన కొండ్రుమ్ ఎంపీటీసీ పంచాడి మంజుల ఎంపీపీగా, అరకు ఎంపీటీసీ చెల్లమ్మ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.

ఏడుగురు.. ఏడుగురు! చివరకు లాటరీతో తేలిన డుంబ్రిగూడ ఎంపీపీ ఎన్నిక!
Panchadi Manjula (Right Side Women)

Edited By:

Updated on: Nov 21, 2026 | 1:53 PM

ఉత్కంఠకు తెరపడింది.. ఎవరి బలం ఎంతో తేల్చేందుకు చివరకు అదృష్టానికే అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు అనూహ్య మలుపులు తిరిగాయి. రెండు వర్గాలకూ సమానంగా ఏడుగురు సభ్యుల మద్దతు లభించడంతో ఎన్నిక టైగా ముగిసింది. దీంతో అధికారులు లాటరీ పద్ధతిని ఆశ్రయించారు. చివరకు డ్రాలో కూటమి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. ఎంపీపీగా కొండ్రుమ్ సెగ్మెంట్ ఎంపీటీసీ కూటమి అభ్యర్థి పంచాడి మంజుల, వైస్ ఎంపీపీగా అరకు సెగ్మెంట్‌కు చెందిన స్వతంత్ర ఎంపీటీసీ సభ్యురాలు చెల్లమ్మ ఎన్నికయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ ఎన్నికలు గురువారమే పూర్తయ్యాయి. అయితే డుంబ్రిగూడ మండలంలో మాత్రం కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దీంతో అధికారులు మరుసటి రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మొత్తం 14 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. వీరిలో కూటమి తరఫున నలుగురు, వైసీపీకి చెందిన ఐదుగురు, మరో ఐదుగురు స్వతంత్ర ఎంపీటీసీలు ఉన్నారు. తొలుత అధికారులు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు.

ఎంపీపీ పదవి కోసం గసభ సెగ్మెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మల్లేశ్వరరావు బరిలో నిలిచారు. ఆయనకు వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడు మద్దతు తెలిపారు. మరోవైపు కూటమి బలపరిచిన అభ్యర్థికి నలుగురు కూటమి సభ్యులతో పాటు ముగ్గురు స్వతంత్ర ఎంపీటీసీలు మద్దతుగా నిలిచారు. దీంతో ఇరు వర్గాల బలం ఏడుగురు చొప్పున సమానమైంది.

చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించగా.. రెండు వర్గాలకూ సమాన మద్దతు లభించడంతో ఫలితం తేలలేదు. దీంతో ఎన్నికల నిబంధనల ప్రకారం లాటరీ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. ఉత్కంఠ మధ్య అధికారులు డ్రా నిర్వహించగా.. కూటమి బలపరిచిన కొండ్రుమ్ సెగ్మెంట్ ఎంపీటీసీ పంచాడి మంజుల విజయం సాధించారు. దీంతో ఆమె డుంబ్రిగూడ ఎంపీపీగా ఎన్నికయ్యారు.

ఇక వైస్ ఎంపీపీ పదవికి గుంటగన్నెల సెగ్మెంట్ నుంచి గెలిచిన దాసుబాబు, అరకు సెగ్మెంట్‌కు చెందిన కూటమి అభ్యర్థి చెల్లమ్మ పోటీ పడ్డారు. ఈ పదవికి కూడా పోటీ సమంగా ఉండటంతో అధికారులు లాటరీ నిర్వహించారు. ఈసారి కూడా అదృష్టం కూటమి అభ్యర్థినే వరించింది. చెల్లమ్మ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.

విజయం సాధించిన మంజుల, చెల్లమ్మకు ఎన్నికల అధికారులు ధ్రువపత్రాలు అందజేశారు. ఇలా సాధారణ ఓటింగ్‌లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో.. చివరకు లాటరీ ఫలితంతో డుంబ్రిగూడ ఎంపీపీ ఎన్నికకు తెరపడింది.

Loading...
Unable to load recommendations.
Follow Us