AP News: మీసం మెలేస్తున్న రొయ్య..! అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్.. టన్నుకు ఎంత పెరిగిందంటే..?

AP News: నిన్నటి దాకా నీరసపడిన రొయ్య నేడు మీసం మెలేస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరగడంతో పది రోజుల వ్యవధిలో టన్నుకు సరాసరిన 80 వేలు ధర పెరిగింది.

AP News: మీసం మెలేస్తున్న రొయ్య..! అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్.. టన్నుకు ఎంత పెరిగిందంటే..?
Prawns
Follow us

|

Updated on: Aug 31, 2021 | 8:28 PM

AP News: నిన్నటి దాకా నీరసపడిన రొయ్య నేడు మీసం మెలేస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరగడంతో పది రోజుల వ్యవధిలో టన్నుకు సరాసరిన 80 వేలు ధర పెరిగింది. దీంతో రొయ్యల రైతు మోమొ సంతోషంతో వెలిగిపోతోంది. తాజా పరిణామాలతో రొయ్యల చెరువుల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కరోనా కష్టకాలంలో ఎగుమతులు లేక, విదేశీ మారకద్రవ్యం రాక ధరలు పడిపోయి ఉక్కిరిబిక్కిరైన రైతులకు తాజాగా పెరిగిన ధరలు ఊరట కలిగిస్తున్నాయి. అయితే ఫీడ్‌ ధరలు కూడా పెరుగుతున్నాయని వీటిని నియంత్రించకపోతే మళ్ళీ నష్టాలు తప్పవన్న ఆందోళనలు ఉన్నాయంటున్నారు ఆక్వా రైతులు.

కరోనా కష్టకాలంలో ఎగుమతులు లేక, ధరలు పడిపోయి వైరస్‌లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రైతులకు గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ధరలు ఊరటనిస్తున్నాయి. పది రోజుల నుంచి ధరలు పైపైకి పాకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో కొనుగోలుదారులు పోటీపడుతున్నారు. దీంతో రైతులకు లాభాల పంట పండుతోంది. ప్రకాశం జిల్లాలో సముద్రతీర ప్రాంతమైన టంగుటూరు, సింగరాయకొండ, చినగంజాం, చీరాల, ఉలవపాడు, గుడ్లూరు, కొత్తపట్నం, వేటపాలెం, ఒంగోలు మండలాల పరిధిలో సుమారు 25 వేల ఎకరాలకు పైగా రొయ్యల చెరువులు విస్తరించి ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల కొన్ని రోజులుగా వైట్‌స్పాట్‌, వైట్‌గట్‌, ఈహెచ్‌పీ వంటి వైరస్‌లతో కొన్ని చోట్ల రైతులు నష్టపోయినా.. పంట దక్కించుకున్న వాళ్లకు మాత్రం మంచి ధరలు లభిస్తున్నాయి. గత రెండేళ్ళుగా నష్టాలు చవిచూసిన తమకు తాజా ధరలు సంతోషం కలిగిస్తున్నాయని ఆక్వా రైతులు చెబుతున్నారు.

టన్నుకు 80 వేలు పెరిగింది.. గత రెండేళ్ళుగా వైరస్‌లతో సతమతం అవుతున్న ఆక్వా రైతులకు ధరల పతనం శరాఘాతంగా మారింది. ఈ పరిస్థితుల్లో జూన్‌లో వంద కౌంట్‌ రొయ్యల ధర.160కి పడిపోయింది. మరో వైపు రెండు నెలల వ్యవధిలోనే 25 కిలోల రొయ్యల మేత ధర 1,650 నుంచి 2,125కు రూపాయలకు పెరిగింది. జులై నుంచి నెమ్మదిగా ధరలు పెరుగుతుండటంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత పది రోజుల వ్యవధిలో టన్నుకు 80 వేల రూపాయలు పెరగడంతో పంట చేతికొచ్చిన రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. చైనా, అమెరికా, యూరప్‌ దేశాల నుంచి డిమాండ్‌ పెరిగింది. మార్కెట్‌లో సరిపడా పంట లేకపోవడంతో ఉన్న పంటకే ధరలు పెంచి కొనుగోలు చేస్తున్నారు. పది రోజుల క్రితం 50 కౌంట్‌ రొయ్యలకు 270 ధర ఉండగా, ప్రస్తుతం 340 రూపాయలకు చేరింది. 60 కౌంట్‌ రొయ్యలు 240 నుంచి 320 చేరింది. నవంబరు వరకు ఈ ధరలు కొనసాగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ ధరలు ఇలాగే ఉంటే ఫరవాలేదని, అలా కాకుండా తిరిగి ధరలు తగ్గితే ఆక్వారైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల ధరలతో పాటు ఫీడ్‌ రేట్లు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ఫీడ్‌ కేజీకి పది రూపాయలు పెంచారని, భవిష్యత్తులో మరింత పెంచితే తమకు వచ్చిన లాభం ఒకచేత్తో ఇస్తూ, మరో చేత్తో లాగేసుకున్నట్టు అవుతుందని ఆక్వా పరిశ్రమ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రొయ్యల సాగు నష్టాల్లోఉన్నా, దీనితోపాటు రొయ్యల కల్చర్‌ పెంచిన వారికి కొద్దిగా ఊరట లభించిందని తిరిగి ఫీడ్‌ రేట్లు పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Firoz, Prakasam District, TV9 Telugu

Viral Photos: ఈ జీవులు భూమిపైనే పుట్టాయా వేరే గ్రహం నుంచి వచ్చాయా..! చాలా వింతగా ఉన్నాయే..?

Massive Robbery: సినీ ఫక్కీలో భారీ దోపిడీ.. ఏకంగా మూడు బ్యాంకులు లేపేసి ఎలా పారిపోయారో చూస్తే అదిరిపోతారంతే!

Health News: మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం భోజనంలో ఈ 5 మార్పులు..! ఏంటో తప్పకుండా తెలుసుకోండి..