చీటికీ మాటికీ చిరచిరలాడిపోతున్నారా? ఆరోగ్యానికి శాపమే..

May 01, 2024

TV9 Telugu

కొందరికి కోపం ముక్కు మీదే ఉంటుంది. చీటికిమాటికి చిరచిరలాడిపోతుంటారు. కోపం శత్రువు లాంటిది. అది ఎందరినో శత్రువుల్ని తెచ్చిపెడుతుంది. మనసుకు నచ్చని మాటలు విన్నా, నచ్చనివారిని చూసినా కొందరికి ఇట్టే కోపం వస్తుంది

సరైన పద్ధతిలో కోపాన్ని ప్రదర్శించడం అనేది అంత సులభం కాదన్నది పెద్దల మాట. అనవసరంగా క్రోధాన్ని ప్రదర్శించడం అనేది మనం విషం తాగుతూ ఎదుటివాణ్ని చావాలని కోరుకోవడం లాంటిది

అందుకే ‘తన కోపమే తన శత్రువు..’ అన్నారు పెద్దలు. ఆవేశానికి పోయి అవకాశాలు కోల్పోతే వచ్చిన ప్రమాదమేం లేదు. కానీ కోపం కారణంగా ఆరోగ్య నష్టం జరుగుతుందనీ, తీవ్రమైన వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు 

అదేంటీ కోపం వల్ల కూడా ప్రాణాంతక రోగాలు వస్తాయా? అని సందేహిస్తున్నారా.. అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చిన్న చిన్న విషయాలకు ఆగ్రహోద్రిక్తులు అవుతున్నారంటే ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నారన్నమాట

చీటికీ మాటికీ వచ్చే కోపం ఎంత చేటు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.. మనకి రోజు వారీ జీవితంలో వచ్చే కోపం కారణంగా కడుపులో అల్సర్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలు పెరుగుతాయట

కోపంగా ఉన్న సమయంలో మన మెదడులోని రక్తనాళాలు సంకోచిస్తాయి. ఇలాంటి పరిస్థితులలో కోపం ఒక్కొక్కసారి రక్తనాళాలు దెబ్బతినేలా కూడా చేస్తుంది. విపరీతమైన కోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి అనేక ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉంది

అధిక కోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. మితిమీరిన కోపం తెచ్చుకోవడం ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. పైగా క్రోధం ప్రతీకారాన్ని ప్రోత్సహిస్తుంది కూడా..

కోపం వల్ల తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి, మధుమేహం సమస్యలు పెరుగుతాయి. ఒక్కోసారి విపరీతమైన కోపం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. అందుకే కోపాన్ని జయించి తన శాంతమే తకు రక్ష సూత్రాన్ని పటించడం మంచిది