
తిరుపతి నుంచి రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు రైల్వే శాఖ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో స్పెషల్ ట్రైన్‌గా ప్రయాణికులకు సేవలు అందిస్తున్న తిరుపతి- రక్సౌల్ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై రెగ్యులర్ ట్రైన్‌గా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ తిరుపతి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ రైలును తిరుపతి పార్లమెంటు సభ్యుడు ఎం గురుమూర్తి, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి రైల్వే స్టేషన్‌లోని 6వ నెంబర్ ప్లాట్ ఫారంపై జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.
ట్రైన్ రాకపోకలు సాగించే సమయం
గతంలో 07051/07052 ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇకపై గుంతకల్ డివిజన్ ఆధ్వర్యంలో 17433/17434 నెంబర్లతో తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ ట్రైన్‌గా ప్రయాణికులకు సేవలను అందించనుంది. ఈ ట్రైన్ ప్రతి ఈ రోజు ఉదయం 8:15 గంటలకు తిరుపతి స్టేషన్ నుంచి బయల్దేరి రేణిగుంట, కడప, గుంతకల్, రాయచూర్, వికారాబాద్ మార్గాల మీదుగా ప్రయాణించి సాయంత్రానికి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
అనంతరం చర్లపల్లి, కాజీపేట, మంచిర్యాల, బిలాస్‌పూర్, రాంచీ, చిత్తరంజన్ తదితర ప్రధాన స్టేషన్ల మీదుగా సుమారు 2,795 కిలోమీటర్లు ప్రయాణించి రక్సౌల్ జంక్షన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ ట్రైన్ ఇదే మార్గాల గుండా ప్రయాణిస్తుందని గుంతకల్ మండల వాణిజ్య అధికారి, స్టేషన్ డైరెక్టర్ మోహన కృష్ణ వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.