
పన్నెండేళ్లకోసారి జరిగే గోదావరి పుష్కరాలను ఈసారి కేవలం ఆధ్యాత్మిక వేడుకగా కాకుండా.. గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి అవకాశంగా మలచాలని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఘాట్ల నిర్మాణం, రహదారుల విస్తరణ, భక్తుల సౌకర్యాల కల్పనకే పరిమితం కాకుండా.. నదీ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పర్యాటకాభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల బలోపేతం వరకు విస్తరించిన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది.
గోదావరి పుష్కరాల నిర్వహణ దిశగా మొదట ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. గోదావరిలో బోట్లపై ప్రయాణిస్తూ వివిధ ప్రాంతాలను పరిశీలించారు. పరిశ్రమలు, స్థానిక సంస్థలు, ఇతర వనరుల నుంచి నదిలోకి చేరుతున్న కాలుష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పుష్కరాల నాటికి తాత్కాలికంగా ఘాట్లు నిర్మించడం, రంగులు వేయడం వంటి పనులతో సరిపెట్టకుండా.. గోదావరి నదిని శాశ్వతంగా పరిశుభ్రంగా ఉంచే వ్యవస్థను రూపొందించాలని స్పష్టం చేశారు. నది స్వచ్ఛత, భక్తుల భద్రత, పర్యావరణ పరిరక్షణ ఒకేసారి సాధించేలా చర్యలు ఉండాలని సూచించారు.
డిప్యూటీ సీఎం పర్యటన అనంతరం తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై మంత్రుల కమిటీ, ఉన్నతాధికారులతో చర్చించారు. పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలనలో చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడమే కాకుండా.. వాటి ద్వారా గోదావరి ప్రాంతానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరాన్ని మెగా సిటీగా అభివృద్ధి చేయడం, గోదావరి తీర ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రహదారులు, పారిశుధ్యం, తాగునీటి వ్యవస్థలను మెరుగుపరచడంపైనా దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. పుష్కరాల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి భవిష్యత్తులో ఆ ప్రాంత అభివృద్ధికి ఆస్తిగా మారాలని సీఎం స్పష్టం చేశారు. పుష్కరాలు ముగిసిన తర్వాత కూడా ఉపయోగపడేలా మౌలిక సదుపాయాలు ఉండాలని చెప్పారు.
పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మొత్తం 525 ఘాట్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లకు అదనంగా 237 కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం 4.5 కిలోమీటర్ల మేర3 ఉన్న ఘాట్ల పొడవును దాదాపు 10 కిలోమీటర్లకు పెంచే ప్రణాళిక రూపొందించారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోనే అత్యధికంగా 150కి పైగా ఘాట్లు నిర్మించనున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రహదారులు, టెంట్ సిటీలు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా చర్యలపై కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మున్సిపల్ శాఖ పరిధిలో దాదాపు రూ.2 వేల కోట్ల వ్యయంతో పనులు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మరో వెయ్యి కోట్లకు పైగా విలువైన పనులు ప్రతిపాదించారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయల విలువైన పనులకు అనుమతులు కూడా మంజూరయ్యాయి.
2015 గోదావరి మహా పుష్కరాల్లో దాదాపు ఐదు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా.. ఈసారి ఆ సంఖ్య 9 నుంచి 10 కోట్లకు చేరవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒక్కరోజులోనే కోటి మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో అడుగులు వేస్తోంది. మొత్తంగా 2027 గోదావరి పుష్కరాలను ప్రభుత్వం కేవలం పన్నెండురోజుల కార్యక్రమంగా చూడడం లేదు. స్వచ్ఛ గోదావరి, మెరుగైన మౌలిక వసతులు, పర్యాటకాభివృద్ధి, పోలవరం పూర్తి, గోదావరి తీర పట్టణాల విస్తరణ.. ఇలా పుష్కరాలను గోదావరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి కేంద్రబిందువుగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి