
కోనసీమ, మార్చి 23: మత్స్యకారుల వలకు రెండు కచ్చిడి చేపలు చిక్కడంతో వారి దశ తిరిగిపోయింది. మార్కెట్లో ఈ చేపలకు భలే గిరాకీ ఉంటుంది. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో వీటిని వేలం వేశారు. ఈ రెండు చేపలే ఏకంగా రూ. లక్షా 94 వేలు పలికాయి. ఓ స్థానిక వ్యాపారి వేలం పాటలో వీటిని దక్కించుకున్నాడు. ఈ చేపల్లో ఒకటి 35 కేజీల బరువు, మరొకటి 30 కిలోల బరువు ఉన్నాయి.
గోల్డెన్ ఫిష్‌గా పిలిచే కచ్చిడి చేపల శాస్త్రీ నామం ప్రొటోనిబియా డయాకాంథస్. ఇవి ఎక్కువగా హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్ మహా సముద్రాలతోపాటు నదులు సముద్రంలో కలిసే చోట్ల, అడుగున ఉండే బురదలో, బండరాళ్లు ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. అందుకే వేటకు వెళ్లిన జాలరులకు అరుదుగా దొరుకుతుంటాయి. ఈ ఏడాది జనవరి నెలలోనూ అనకాపల్లి జిల్లాకు చెందిన మత్స్యకారులకు కచ్చిడి చేపలు దొరికాయి. అయితే ఈ చేపలకు మార్కెట్లో డిమాండ్ కూడా కాస్త ఎక్కువే. కచ్చిడి చేపలలో ఔషధ గుణాలు ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. కచ్చిడి చేపలోని కొన్ని భాగాలను మందుల తయారీకి ఉపయోగిస్తారని, ఈ చేపల గాల్ బ్లాడర్‌తో సర్జరీ చేసిన తర్వాత కుట్లు వేసే దారాన్ని తయారు చేస్తారని చెబుతున్నారు. వీటిని తింటే కంటి చూపు మెరుగుపరిచే విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయట. అందుకే ఎంత ధరైనా చెల్లించి వీటిని కొనుగోలు చేస్తారు. కొన్ని రకాల వైన్ తయారీలోనూ వీటిని వినియోగిస్తారని జాలరులు చెబుతున్నారు.
ఆడ కచ్చిడి చేపలు మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలో వచ్చి గుడ్లుపెడతాయని చెబుతున్నారు. అయితే తాజాగా దొరికిన రెండు కచ్చిడి చేపలు.. ఆడ చేపలు కావడంతో కొంచెం ధర తక్కువ పలికాయని మత్స్యకారులు చెబుతున్నారు. అదే మగ చేపలు అయితే ఏకంగా రూ.4 లక్షలకు పైగానే ధర పలికేవట. గతంలో కాకినాడ తీరంలో దొరికిన 20 కిలోల బరువున్న కచ్చిడి చేప ఏకంగా రూ.3.10 లక్షలు పలికింది. ఈ చేపలకు విదేశాల్లోనూ మంచి గిరాకి ఉంది. స్థానికంగా చేపలను కొనుగోలు చేసి సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.