ఏపీ తీరం వైపు దూసుకువస్తున్న తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న డీప్ డిప్రెషన్ సెప్టెంబర్ 23 రాత్రి విశాఖపట్నం–గోపాలపూర్ మధ్య, కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని IMD తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, బలమైన గాలులకు హెచ్చరికలు జారీ కాగా, తెలంగాణలోనూ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు అలర్ట్ కొనసాగుతోంది.

ఏపీ తీరం వైపు దూసుకువస్తున్న తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
Weather Alert

Updated on: Sep 23, 2026 | 7:35 AM

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం జనాన్ని హడలెత్తిస్తోంది. వాయుగుండం బుధవారం రాత్రి విశాఖ-గోపాలపూర్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. కళింగపట్నం దగ్గర తీవ్ర వాయుగుండం తీరందాటనుంది. ఇప్పటికే తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అటు అన్ని ప్రధాన ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నేడు, రేపు ఏపీలోని 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం.. తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతుందని.. ఈరోజు రాత్రి విశాఖపట్నం – గోపాలపూర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు ఏపీలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అలర్ట్ జారీ చేశారు. వర్షప్రభావిత జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖ, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో అలాగే.. శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు.

అంతేకాకుండా.. ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు.. మూడు రోజుల పాటు ఏపీ కి భారీ వర్ష సూచన చేశారు. ఏపీలో 9 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాకు హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లడ్‌ అలర్ట్ ప్రకటించారు. అల్లూరి, మన్యం జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం,పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

తెలంగాణలో కూడా భారీ వర్షాలు..

తెలంగాణపై కూడా వాయుగుండం ప్రభావం పడింది. తెలంగాణకు రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో 4 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్‌ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు.. భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్ జారీ అయింది. మహబూబ్‌నగర్ జిల్లాకు కూడా ఫ్లాష్‌ఫ్లడ్‌ హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us